ఫ్రెంచ్ ఓపెన్ నాలుగో రౌండ్‌లో అరుదైన సంఘటన..
మ్యాచ్ ఓడిన తర్వాత రఫెల్ నాదల్ ఆటోగ్రాఫ్ అడిగిన అమెరికన్ ప్లేయర్ సెబాస్టియన్ కోర్డా...
ప్రతీ ఆటలో గెలుపు ఓటములు సహజం. విజయం కోసం కసిగా పోరాడే ఆటగాడు, ప్రత్యర్థి ఆటగాడిని కొన్ని సందర్భాల్లో శత్రువుగా భావిస్తాడు కూడా. అయితే తనను ఓడించిన ప్రత్యర్థితోనే ఆటోగ్రాఫ్ తీసుకుని, అరుదైన జ్ఞాపకంగా మలుచుకున్నాడు టెన్నిస్ ప్లేయర్ సెబాస్టియర్ కోర్డా. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను ఫ్రెంచ్ ఓపెన్ నాలుగో రౌండ్‌లో ఎదుర్కొన్న కోర్డా... 1-6, 1-6, 2-6 తేడాతో ఓడిపోయాడు.
నాదల్ చేతిలో చిత్తుగా ఓడిన అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ సెబాస్టియర్ కోర్డా... మ్యాచ్ అనంతరం రఫెల్‌ని ఆటోగ్రాఫ్ అడిగాడు. నదాల్ వెంటనే... కోర్డా టీషర్ట్‌పై ఆటోగ్రాఫ్ చేశాడు. ‘చిన్నతనం నుంచి రఫెల్‌ది వీరాభిమానిని. తన ఆడే ప్రతీ మ్యాచ్ చూస్తాను. ఇప్పుడు రఫెల్‌తోనే ఆడడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పాడు కోర్డా. క్రికెట్‌తో పాటు టెన్నిస్‌ను కూడా ‘జెంటిల్మెన్ గేమ్’ అని పిలుస్తారు. ఈ సంఘటనతో అది నిజమైంది...