రేపటి నుంచే అభిమానుల మధ్య ఫ్రెంచ్ ఓపెన్

By team teluguFirst Published Sep 26, 2020, 8:41 AM IST
Highlights

యుఎస్‌ ఓపెన్‌‌ ప్రేక్షకులు లేకుండానే ముగిసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సైతం అదే తరహాలోనే ముగుస్తుందనే అనుకున్నారు. కానీ మట్టికోర్టు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వీక్షించేందుకు ప్రతి రోజుకు వెయ్యి మంది ప్రేక్షకులకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడలపై పడింది. బయో బబుల్‌ వాతావరణంలో ఇప్పుడు క్రీడలు పున ప్రారంభమైనా, స్టేడియంలోకి అభిమానులకు ప్రవేశం నిరాకరిస్తున్నారు. 

యుఎస్‌ ఓపెన్‌‌ ప్రేక్షకులు లేకుండానే ముగిసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సైతం అదే తరహాలోనే ముగుస్తుందనే అనుకున్నారు. కానీ మట్టికోర్టు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వీక్షించేందుకు ప్రతి రోజుకు వెయ్యి మంది ప్రేక్షకులకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 

2019 ఫ్రెంచ్‌ ఓపెన్‌ను 5.2 లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ ఏడాది అభిమానుల హాజరు 3 శాతమే కానుంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వహణ ప్రాంగణం 25 ఎకరాల్లో ఉంది. కోవిడ్‌ నివారణ చర్యలు తీసుకుని కనీసం 11, 500 మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయగలమని ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకులు ప్రభుత్వానికి నివేదించారు. 

కనీసం రోజుకు 5 వేల మందికైనా అనుమతి లభిస్తుందని ఆశించారు. కానీ వెయ్యి మందికే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రతి ఏటా టిక్కెట్ల ద్వారా 20 శాతం ఆదాయం లభించేది. ఇప్పుడా ఆ ఆదాయానికి గండి పడింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ అర్హత మ్యాచులు సెప్టెంబర్‌ 21 నుంచి ఆరంభమయ్యాయి. సెప్టెంబర్‌ 27 నుంచి ప్రధాన టోర్నీ ఆరంభం కానుంది.

వాస్తవానికి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్రతి ఏటా మేనెలలో నిర్వహించేవారు. కరోనా వైరస్‌ దెబ్బకు నాలుగు నెలలు ఆలస్యంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక టోర్నీలో ఆడేందుకు వచ్చిన ప్లేయర్లకు ఐదు రోజుల వ్యవధిలో కరోనా పరీక్షలు చేస్తారు. 

ఆటగాళ్లకు రెండు సార్లు నెగెటివ్‌ అని వస్తేనే వారిని టోర్నీలో ఆడేందుకు అనుమతిస్తామని టోర్నీ డైరెక్టర్‌ తెలిపారు. కరోనా దెబ్బకు ఆర్థికరంగం పడకేసిన ఫ్రెంచ్ ఓపెన్ లో చెల్లించే ప్రైజ్ మనీని పెంచారు నిర్వాహకులు.

click me!