దుబాయ్ లో గత నెలలో జరిగిన మ్యాచ్ లతో టెన్నిస్ ఛాంపియన్ షిప్ తో సానియా మీర్జా కెరీర్ కు అధికారికంగా వీడోలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎగ్జిబిషన్ మ్యాచ్ తో ఆటనుంచి పూర్తిగా నిష్క్రమించింది.
హైదరాబాద్ : తన ఆటకు బీజం పడి.. ఎక్కడి నుంచి ఆట మొదలు పెట్టిందో.. ఎక్కడి నుంచి ఒక్కో షాటుతో తన కెరీర్ కు సోఫానాలు వేసుకుంటూ ప్రొఫెషనల్ గా విజయాలను అందుకుంటు ముందుకు సాగిందో.. అక్కడే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. కెరీర్లో తన చివరి ఆట ఆడి.. తన గుర్తింపైన టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతూ.. పూర్తిగా నిష్క్రమించింది. సొంత గడ్డపై చివరిసారిగా ఆదివారంనాడు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతూ.. టెన్నిస్ నుంచి నిష్క్రమించింది. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఈ ఆదివారం. ఈ భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది.
undefined
ఆదివారం నాడు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్లో తన చివరి ఆటఆడింది. ఆ తర్వాత ఆట నుంచి నిష్క్రమించింది. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ సానియా కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు, ప్రేక్షకులకు రకరకాల భిన్నమైన భావోద్వేగాలను కలిగించింది. ఓ అభిమాని అయితే కన్నీరు పెట్టుకుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇవాన్ డోడిగ్, బెతాని మాటెక్, మారియన్ బార్టోలి, కారా బ్లాక్, రోహన్ బోపన్నతో కలిసి సానియా టెన్నిస్ కోర్టులో అలరించింది. ర్యాపర్ ఎంసీ స్టాన్ మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
ముందుగా సానియాతో సహా మిగతా ఆరుగురు ప్లేయర్లు వార్మప్ కోసం బంతిని ఆడుతూ కోర్టు చుట్టూ సరదాగా తిరిగారు. మిక్స్డ్ డబల్స్ లో ముందు యువరాజ్-బెతానీ జోడీతో సానియా - ఇవాన్ జంట తలపడింది.. ఆ తర్వాత చివరి మ్యాచ్ బెతాని-ఇవాన్ లతో సానియా - బోపన్న పోటీ పడ్డారు. ఈ మ్యాచ్ మొత్తం భావోద్వేగ ఘటనలు, ప్రశంసాపూర్వకమైన ఘటనలతో ముగిసింది. సానియా మీర్జా టెన్నిస్ కు దూరమవుతుందని తెలిసి ఓ మహిళ అభిమాని కన్నీరు పెట్టుకుంది. దీంతో సానియా ఆమె దగ్గరికి వెళ్లి షేక్ హ్యండ్ ఇచ్చింది.
ఇక మ్యాచ్ నాలుగో గేమ్ మధ్యలో ఇవాన్ సామ చేవిక రెడ్డి అనే బాల్ గర్ల్ కి రాకెట్ ఇచ్చి ఆడమన్నాడు.. తాను కోర్టు బయటికి వెళ్లి ఆమెను ప్రోత్సహించాడు. చేవిక రెడ్డి షాట్లు కొడుతుంటే ఇవాన్ కేరింతలు కొట్టాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్ అయిన ఈ మ్యాచ్ లో సానియా తనదైన స్టైల్ లో తన ఆట తీరు ప్రదర్శిస్తూ మెరుపులు మెరిపించారు. డ్రాప్ షాట్లు, ఫోర్ హాండ్ విన్నర్లతో ఆకట్టుకుంది. ఆట జరుగుతున్నంత సేపు స్టేడియం కేకలతో హోరెత్తిపోయింది. సానియా పాయింట్ దక్కించుకున్న ప్రతిసారి పెద్దఎత్తున అభినందనలు.. చప్పట్లు, కేకలతో స్టేడియం మారుమోగిపోయింది. ఈ మ్యాచ్లో సానియా జోడినే గెలిచింది.
ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ కు హాజరైన తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆటగాళ్లందరికీ శాలువాలతో సత్కరించారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ప్రత్యేకంగా శాలువాతో పాటు జ్ఞాపిక ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘క్రీడారంగంలో పురుషాధిక్యత ఎక్కువ. అలాంటి రంగంలో తనదైన ప్రయాణాన్ని ప్రారంభించి మహిళల కోసం ఓ మార్గాన్ని వేసింది సానియా. ఈ క్రమంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను దాటుకుంటూ ఆమె ఛాంపియన్గా ఎరిగింది. తమ ఆట తీరుతో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకునే ఎంతోమంది అమ్మాయిలకు సానియా ఆదర్శం’ అన్నారు.
ఆ తర్వాత మాట్లాడిన సానియా మీర్జా తీవ్ర భావోద్వేగానికి గురైంది. కుమారుడు ఇజాన్ తో కలిసి మాట్లాడుతూ.. మధ్యలో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక గద్గద స్వరంతోనే మాట్లాడింది. ఈ సందర్భంగా తన ఎదుగుదలకు కారణమైన హైదరాబాద్ కు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అభిమానులకు అభివాదం చేసింది. వారు లేకపోతే తాను లేనని చెప్పుకొచ్చింది. తనలాంటి సానియాలు ఎంతోమంది వస్తారని, రావాలని ఆశించింది. ఆ తర్వాత టెన్నిస్ బంతులను ప్రేక్షకులకు విసురుతూ అభివాదం చేసింది. తనయుడు ఇజాన్ తో కలిసి కోర్టు నుంచి నిష్క్రమించింది
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ టెన్నిస్ ప్లేయర్గానే కాదు సానియా మీర్జా తను సాధించిన ఘనతలతో దేశం మొత్తానికి నిజమైన స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడల కార్యదర్శి సందీప్ సుల్తానియా, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, నగర కమిషనర్ సివి ఆనంద్, షాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, చాముండేశ్వరి నాథ్, హీరో దుల్కర్ సల్మాన్ లు హాజరయ్యారు.