డెవిస్ కప్... పాకిస్థాన్ లో అయితే ఆడలేం: ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్

By Arun Kumar P  |  First Published Aug 9, 2019, 4:35 PM IST

భారత్ కు చెందిన టెన్నిస్ ప్లేయర్లు డేవిస్ కప్ కోసం పాకిస్థాన్ లో పర్యటించడం లేదని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ వేదికన జరిగే డేవిస్ కప్ టోర్నమెంట్ కు భారత్ దూరంగా  వుండనుందని అధికారులు తెలిపారు.  


భారత్-పాకిస్ధాన్ ల మధ్య దశాబ్ద కాలంగా క్రీడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో తప్ప ఇరు దేశాలు ఏ క్రీడా విభాగంలోనూ ద్వైపాక్షికంగా పోటీలు  నిర్వహించడంలేదు. అయితే తాజాగా జమ్మూ కశ్మీర్ విషయంలో ఈ దాయాది దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో  పాక్ లో జరిగే ఓ అంతర్జాతీయ క్రీడా పోటీలో కూడా పాల్గొనకూడదని భారత్  భావిస్తోంది.  

ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ ను అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ పాకిస్థాన్ లో నిర్వహించనుంది. రాజధాని ఇస్లామాబాద్ నగరంలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జరిగే ఈ పోటీల్లో టెన్నిస్ క్రీడాకారులు పాల్గొనాల్సి వుంది. భారత్ నుండి ఓ బృందం పాక్ కు వెళ్లనున్నట్లు కొద్దిరోజుల క్రితమే ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్  కూడా ప్రకటించింది. 

Latest Videos

undefined

అయితే భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ రాష్ట్రం విషయంలో తీసుకున్న నిర్ణయంతో మరోసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత క్రీడాకారులు పాక్ లో పర్యటించడం సేఫ్ కాదని ఏఐటిఏ భావిస్తోంది. దీంతో డేవిస్ కప్ కు దూరంగా వుండాలని నిర్ణయించింది. 

ఈ మేరకు ఇప్పటికే ఐటిఎఫ్ కు సమాచారం  అందించినట్లు ఏఐటీఏ అధికారులు తెలిపారు. '' పాక్ భారత క్రీడాకారులకు వీసా ఇవ్వడానికి నిరాకరించవచ్చు..? ఒకవేళ ఇచ్చినా పాకిస్థాన్ భారత ఆటగాళ్లకు మెరుగైన సెక్యూరిటీని అందించకపోవచ్చు. కాబట్టి ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్ధితుల్లో ఆటగాళ్లను అక్కడికి పంపించడం సేఫ్ కాదని భావిస్తున్నాం. కాబట్టి భారత్-పాక్ ల మధ్య జరిగే మ్యాచ్ ను రద్దు చేయాలని ఐటిఎఫ్ కు సూచించాం. '' అని  భారత టెన్నిస్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. 

 1964 సంవత్సరం లాహోర్ లో జరిగిన డేవిస్ కప్  లో భారత ఆటగాళ్లు చివరిసారిగా పాక్ తో తలపడ్డారు. అందులో భారత్ 4-0 తేడాతో  పాక్ ను వారి స్వదేశంలోనే మట్టికరిపించి సత్తా చాటింది. ఇలా 55 ఏళ్ల తర్వాత మళ్లీ భారత  టెన్నిస్ బృందం పాక్ తో తలపడాల్సి వుండగా...తాజా పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదు. 

సంబంధిత వార్తలు

55ఏళ్ల తర్వాత మళ్లీ.... పాకిస్థాన్ పర్యటనకు భారత టెన్నిస్ టీం

 

click me!