సోనియాగాంధీతో షర్మిల భేటీ:వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చర్చ?

By narsimha lode  |  First Published Aug 31, 2023, 9:40 AM IST

కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత  సోనియాగాంధీతో  వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల ఇవాళ భేటీ అయ్యారు.


న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  సోనియాగాంధీతో  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల గురువారంనాడు  న్యూఢిల్లీలో  భేటీ అయ్యారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో  విలీనం చేసే విషయమై  చర్చించేందుకు ఈ భేటీ జరిగిందని  ప్రచారం సాగుతుంది. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని  షర్మిల భావిస్తున్నారని  గత కొంత కాలంగా ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా  కర్ణాటక డిప్యూటీ సీఎం  డికే శివకుమార్ తో ఆమె పలు దఫాలు సమావేశమయ్యారు.

 భర్త అనిల్ తో కలిసి  వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లారు. ఇవాళ సోనియా గాంధీతో భేటీ అయ్యారు.   వైఎస్ షర్మిల  న్యూఢిల్లీ పర్యటన వ్యక్తిగతమైందని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే  వైఎస్ఆర్‌టీపీని  కాంగ్రెస్ లో విలీనం చేసే  విషయమై  కాంగ్రెస్ అగ్రనేతలతో  చర్చించేందుకు  వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లినట్టుగా  ప్రచారం సాగుతుంది.  ఈ ప్రచారానికి  ఊతమిచ్చేలా  షర్మిల, ఆమె భర్త అనిల్ ఇవాళ  సోనియాగాంధీతో  సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Latest Videos

undefined

వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే వైఎస్ షర్మిల సేవలను  తెలంగాణలో ఉపయోగించుకుంటారా, ఏపీలో వినియోగించుకుంటారా అనే విషయమై  చర్చ కూడ లేకపోలేదు. షర్మిల తెలంగాణలో  ప్రచారం  చేస్తే రాజకీయంగా  బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉందని  కొందరు కాంగ్రెస్ నేతలు  భావిస్తున్నారు.  తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చి  కాంగ్రెస్ కు నష్టం చేసేలా  కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం ఉందని  కొందరు కాంగ్రెస్ నేతలు  అభిప్రాయంతో ఉన్నారు.

ఇదే విషయాన్ని తెలంగాణకు  చెందిన  కాంగ్రెస్ నేతలు  పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారు. అయితే  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం షర్మిల తెలంగాణలో  పార్టీ కోసం పనిచేస్తే నష్టం లేదని  ప్రకటించారు.   వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ కోసం పనిచేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన అయిష్టతను వ్యక్తం చేశారు. మీడియా సమావేశాల్లోనే ఆయన ఈ విషయాన్ని పలుమార్లు  ప్రకటించారు.

ఏపీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే  రాజకీయంగా తమకు కలిసివచ్చే అవకాశం లేకపోలేదని  ఆ పార్టీకి చెందిన ఏపీ నేతలు కొందరు భావిస్తున్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారు  వైఎస్ జగన్ వైపు వెళ్లిపోయారని  కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానం ఉన్న వారు  కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు  ఆశాభావంతో ఉన్నారు.  తెలంగాణ కంటే ఏపీలోనే షర్మిలకు  రాజకీయంగా మంచి అవకాశాలుంటాయని  కూడ  మరికొందరు  తెలంగాణకు చెందిన  కాంగ్రెస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. 

click me!