తెలంగాణ ఎన్నికలు: పవన్ దూరమే, జగన్ నిర్ణయం ఇదీ...

By pratap reddyFirst Published Nov 11, 2018, 9:20 AM IST
Highlights

2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు 79 శాసనసభ స్థానాలకు, 3 లోకసభ స్థానాలకు పోటీ చేసింది. ఖమ్మం లోకసభ స్థానంతో పాటు మూడు శాసనసభ స్థానాలను వైసిపి గెలుచుకుంది. అయితే వారంతా అధికార టిఆర్ఎస్ లో చేరిపోయారు.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం పార్టీ తన నిర్ణయాన్ని తీసుకుంది. 

వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తన లక్ష్యానికి ఆటంకం ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే, 2024లో జరిగే ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు 79 శాసనసభ స్థానాలకు, 3 లోకసభ స్థానాలకు పోటీ చేసింది. ఖమ్మం లోకసభ స్థానంతో పాటు మూడు శాసనసభ స్థానాలను వైసిపి గెలుచుకుంది. అయితే వారంతా అధికార టిఆర్ఎస్ లో చేరిపోయారు. 

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్పష్టంగా ఆ విషయం చెప్పకపోయినా పరోక్షంగా అదే విషయం చెప్పారు. 2019లో ఎన్నికలు జరిగితే 23 శాసనసభ స్థానాలకు, 3 లోకసభ స్థానాలకు పోటీ చేయాలని అనుకున్నామని ఆయన చెప్పారు. 

పవన్ కల్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. దీంతో తెలంగాణపై దృష్టి పెట్టే వీలు ఆయనకు చిక్కడం లేదని అంటున్నారు. 

click me!