
నల్గొండ : మీరు రోజుకు ఎన్నిసార్లు టీ తాగుతారు. 4,5.. లేదంటే ఓ ఆరువరకు.. అంతేనా..? ఇక భోజనం... పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్.. రాత్రికి డిన్నర్.. మామూలే కదా అంటారా? టిఫినో, భోజనమో కాస్త ఆలస్యమైతే.. ఏం చేస్తారు? బాగా లేటవుతుందనుకుంటే ఓ టీనో, కాఫీనో తాగి కాసేపు ఆకలిని అదిమేస్తారు. అంతేకదా.. అంతే కానీ పూర్తిగా భోజనం చేయకుండా.. టీలమీదే బతికేయరు కదా.. అయితే ఈమె మాత్రం డిఫరెంట్..
భోజనం అరగంట ఆలస్యమైతే ఆకలితో కేకలు వేస్తాం.. ఒక్కపూట భోజనం చేయకపోతే నీరసం వచ్చి పడిపోతాం. అలాంటిది ఓ వృద్ధురాలు ఏకంగా 35 యేళ్లుగా భోజనం మానేసింది. కేవలం ‘టీ’ మాత్రమే తాగుతూ తన బతుకు బండిని నెట్టుకొస్తుంది. నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, దామర భీమనపల్లికి చెందిన కొండూరి రుకునమ్మ 35 యేళ్లుగా ‘టీ’నే తన ఆహారంగా మార్చుకుంది.
దీనికి కారణం 35యేళ్ల క్రితం ఆమెకు కడుపులో నొప్పి వచ్చింది. దీంతో శస్త్ర చికిత్స చేశారు. చికిత్స తరువాత వాంతులు అయ్యాయట. ఏది తిన్నా కడుపులో ఇమేడేది కాదట. ఓ వైపు ఆకలి, మరోవైపు వాంతులు.. దీంతో ఆకలిని తీర్చుకునేందుకు రుకునమ్మ టీ తాగడం మొదలుపెట్టిందట.
అయితే టీ తాగితే మాత్రం ఎలాంటి వాంతులు కాకపోవడంతో.. ఆకలైనప్పుడల్లా ఏదైనా తింటే వాంతులవుతాయన్న భయంతో టీ తాగడం మొదలుపెట్టింది. అది కాస్తా అలవాటుగా మారిపోయింది. కొన్నిసార్లు టీలో బిస్కెట్లు, మరమరాలు, రొట్టె వేసుకుని కూడా తింటుందట.
గత 35 యేళ్లుగా తన ఆహారం ఇదేనని, అప్పట్నుంచి ఇప్పటివరకు తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని రుకునమ్మ చెబుతోంది. ఇది వైద్యులకు కూడా ఆశ్చర్యకరంగానే ఉంది.
టీ తాగితే ఆకలి కాసేపు ఆగడం మాట అటుంచితే టీ తాగి చనిపోయిన వారి గురించి మీకు తెలుసా? ఎలా అంటే నిరుడు మార్చిలో ఓ సంఘటన గురించి తెలుసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో మార్చి 31, 2021నాడు విషాదం చోటుచేసుకుంది. టీ తాగి ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి కారణం ఆ టీలో విషం కలవడమే. ఎలా కలిసిందో తెలిసి షాక్ అయ్యారు.
వంటింట్లో ఉన్న ఎండ్రిన్ గుళికలను టీ పొడి అనుకుంది అంజమ్మ. టీ పెట్టాలనుకున్నప్పుడు వాటినే టీ పొడికి బదులు టీలో వేసింది. అలాగే టీ కాచింది. ఈ టీని అంజమ్మ తనతో పాటు భర్త మల్లయ్య, మరిది భిక్షపతిలకు కూడా ఇచ్చింది. వారూ హాయిగా తాగేశారు.
కాగా టీ తాగిన వెంటనే అంజమ్మ ఒక్కసారిగా కిందామీదా చేసి.. మృతి చెందగా, అంజమ్మ భర్త మల్లయ్య, మరిది భిక్షపతి కూడా ఏదోలో చేస్తుండడంతో.. గమనించిన చుట్టుపక్కల వారు ముగ్గురినీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిని పరీక్షించిన డాక్టర్లు అంజమ్మ చనిపోయిందని, మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా ఉందని తేల్చారు.