రాష్ట్రం మొత్తం ఒక ఎత్తయితే.. గజ్వేల్, కామారెడ్డి మరో ఎత్తు. తెలంగాణ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తుండటంతో ఆయనపై బీజేపీ నేత ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పోటీ చేస్తుండటంతో ఈ రెండూ నియోజకవర్గాలపై తెలుగు ప్రజలతో పాటు యావత్ దేశం చూపు పడింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టానికి తెరపడింది. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు పడింది. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దొరకని ఆశావహులు చివరి నిమిషంలో రెబల్స్‌గా బరిలోకి దిగడంతో అనేక నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీనికి తోడు ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు రైతులు, నిరుద్యోగులు , ఇతరులు బరిలో నిలిచారు. వీరిలో కొందరు ఇవాళ నామినేషన్లను ఉపసంహరించుకోగా.. మరికొందరి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
రాష్ట్రం మొత్తం ఒక ఎత్తయితే.. గజ్వేల్, కామారెడ్డి మరో ఎత్తు. తెలంగాణ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తుండటంతో ఆయనపై బీజేపీ నేత ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పోటీ చేస్తుండటంతో ఈ రెండూ నియోజకవర్గాలపై తెలుగు ప్రజలతో పాటు యావత్ దేశం చూపు పడింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత గజ్వేల్‌లో మొత్తంగా 44 మంది అభ్యర్ధులు బరిలో నిలిచినట్లు ఈసీ తెలిపింది. పరిశీలన తర్వాత 114 మంది పోటీలో వుండగా.. బుధవారం 70 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్, ఈటలకు పోటీగా కాంగ్రెస్ అభ్యర్ధిగా తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు.
ALso Read: Telangana Assembly Elections 2023: మూడు ప్రధాన పార్టీలకు రెబల్ కష్టాలు.. ఎవరిని దెబ్బకొట్టేనో.?
ఇక కామారెడ్డి విషయానికి వస్తే.. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఇక్కడ మొత్తంగా 39 మంది బరిలో నిలిచినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నామినేషన్ల పరిశీలన తర్వాత 58 మంది పోటీలో వుంటే.. బుధవారం 19 మంది బరిలో నుంచి తప్పుకున్నారు. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌లకు పోటీగా బీజేపీ నుంచి కే. వెంకట రమణారెడ్డి పోటీలో నిలిచారు. అయితే మూడు ప్రధాన పార్టీల్లోనూ కాంగ్రెస్‌ను రెబల్స్ చికాకు పెట్టారు.
అయితే హైకమాండ్ బుజ్జగింపులు , హామీలతో చాలా వరకు రెబల్స్ మెట్టు దిగారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి గుర్తింపు వుంటుందని చెప్పడం, ఇతరత్రా హామీలతో కీలక నేతలు వెనక్కి తగ్గారు. సూర్యాపేటలో పటేల్ రమేశ్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రామిరెడ్డి, జుక్కల్‌లో గంగారం, బాన్సువాడలో బాలరాజు, డోర్నకల్‌లో నెహ్రూ నాయక్, వరంగల్ పశ్చిమలో జంగా రాఘవరెడ్డిలు నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు.