తెలంగాణ అసెంబ్లీ: సీఎల్పీ నేత ఎవరు?

By narsimha lodeFirst Published Dec 13, 2018, 3:58 PM IST
Highlights

ఈ నెల 7వ తేదిన జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన 19 మంది అభ్యర్థులు విజయం సాధించారు


హైదరాబాద్:ఈ నెల 7వ తేదిన జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన 19 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఆ పార్టీ అగ్రనేతలంతా ఓటమి పాలయ్యారు. విజయం సాధించిన వారిలో సీఎల్పీ నేత  పదవి ఎవరికీ దక్కుతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

2014 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీపక్షనేతగా జానారెడ్డిని ఎన్నుకొన్నారు.ఈ ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలయ్యారు.ఈ  ఎన్నికల్లో  జానారెడ్డి సహా ఆ పార్టీకి చెందిన సీనియర్లు ఓటమి పాలయ్యారు.

 మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ విప్ జగ్గారెడ్డి , మాజీ డిప్యూటీ స్పీకర్  మల్లు భట్టి విక్రమార్కలు ఈ  ఎన్నికల్లో విజయం సాధించారు. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుండి  విజయం సాధించారు.

అయితే పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సీఎల్పీ పదవి దక్కే అవకాశం లేకపోవచ్చు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లేదా, మాజీ విప్  జగ్గారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

ఉమ్మడి ఏపీ రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన  మల్లు భట్టి విక్రమార్క పేరు సీఎల్పీ నేతగా ఎన్నుకొనే ఛాన్స లేకపోలేదనే  ప్రచారం కూడ లేకపోలేదు. దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు శాసనసభ వ్యవహారాల్లో  కూడ మంచి పట్టుంది. దీంతో భట్టి విక్రమార్కకు ఛాన్స్  దక్కే అవకాశం లేకపోలేదని  అంటున్నారు.

కేసీఆర్‌‌ను ఈ దఫా అసెంబ్లీలో ఎండగట్టాలంటే బలమైనవారిని సీఎల్పీ నేతగా ఎన్నుకోవాలనే  అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. మరో వైపు  టీపీసీసీ చీఫ్‌ పదవి నుండి  ఉత్తమ్‌ను తప్పిస్తే  ఆ పదవిలో మల్లు భట్టి విక్రమార్కను  నియమించే అవకాశం లేకపోలేదని  ఆ పార్టీలో ప్రచారంలో ఉంది. ఒకవేళ మల్లు భట్టి విక్రమార్కను టీపీసీసీ చీఫ్ చేస్తే సీఎల్పీ నేతగా మరోకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. 
 

click me!