జేపీ నడ్డాతో భేటీ: బిజెపిలోకి తెలంగాణ రాములమ్మ విజయశాంతి పక్కా?

By telugu teamFirst Published Nov 9, 2020, 2:04 PM IST
Highlights

తెలంగాణ రాములమ్మ, కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి బిజెపిలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇటీవలి పరిణామాలు విజయశాంతి బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి బిజెపిలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన ప్రకటనలో కాంగ్రెసు పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆ విషయంపై సంకేతాలు ఇస్తుండగా, మరో పరిణామం కూడా చోటు చేసుకుంది. బిజెపిలో చేరడానికి ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సి ఉందని అంటున్నారు. 

బిజెపి నాయకత్వంతో ఆమె ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఇటీవల ఆమెతో భేటీ అయ్యారు అయితే, విజయశాంతి కుటుంబ సభ్యులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, తాను పండుగ సందర్భంగా విజయశాంతిని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని కిషన్ రెడ్డి అంటున్నారు రాజకీయాలతో సంబంధం లేదని కూడా చెప్పారు. కానీ ఆ మాటలను ఎవరూ విశ్వసించడం లేదు.

Also Read: విజయశాంతి ప్రకటన షాక్: కేసీఆర్ గురిపెట్టినా కాంగ్రెస్ కు తగిలింది

కాగా, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండు సార్లు విజయశాంతితో సమావేశమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై బిజెపి చేస్తున్న పోరాటాలను ఆమె ప్రశంసించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బండి సంజయ్ ప్రదర్శిస్తున్న దూకుడు కూడా తెలంగాణ రాములమ్మకు నచ్చినట్లు చెబుతున్నారు. 

ఆ భేటీలకు ముందే ఆమె బిజెపి జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డాతో ఆమె సమావేశమైనట్లు తెలుస్తోంది.  బిజెపి అధ్యక్ష పదవిని చేపట్టిన సందర్భంగా అభినందించడానికి మాత్రమే విజయశాంతి నడ్డాను కలిసినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే, బిజెపిలో చేరడానికి సుముఖంగా ఉండడం వల్లనే నడ్డాతో ఆమె సమావేశమైనట్లు చెబుతున్నారు. 

కాగా, ఇటీవల బండి సంజయ్ విజయశాంతిని ప్రశంసించడం కూడా చర్చనీయాంశంగా మారింది. విజయశాంతి గొప్ప నాయకురాలని, తెలంగాణ ఉద్యమకారులకు చేసినట్లే విజయశాంతికి కూడా కేసీఆర్ అన్యాయం చేశారని ఆయన అన్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే విజయశాంతి బిజెపిలోకి ప్రవేశించడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

click me!