
తెలంగాణలో అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన... హైదరాబాద్‌కు కేంద్రం 169 బస్తీ దావాఖాలను మంజూరు చేసిందని, దాని పేరు మార్చుకుని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎన్నికల సమయంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని ఎద్దేవా చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్ బిల్లులో ఆ అంశం చేర్చారా లేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిన తర్వాత కేసీఆర్ సకుటుంబ సమేతంగా సోనియా గాంధీకి పాదాభివందనం చేసినప్పుడు.. పోలవరం ముంపు ప్రాంతాల గురించి జ్ఞాపకం రాలేదా అని నిలదీశారు.
2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ను విమర్శించారని చెప్పారు. తాము ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరునూ కలిసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లినా భాజపాను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని.. తమ పార్టీకి యువత, విద్యార్థులు, మహిళలే బలమన్నారు. చాలా చోట్ల యువతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు.
2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్లీ పాత హామీలే మేనిఫెస్టోలో ప్రకటించారని కిషన్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీలో మళ్లీ కారు అధికారంలోకి వస్తే ఇంటికొక బోటు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
బీజేపీ గెలిస్తే వర్షాకాలం వచ్చేనాటికి యుద్ధప్రాతిపదికన పూర్తిస్థాయిలో వరదనీటి కాల్వలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ మేయర్ ఆధ్వర్యంలో సమర్థంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఇంటికొక బోటు కావాలా?యుద్ధప్రాతిపదికన వరదకాల్వల నిర్మాణం కావాలా? ఏది అవసరమో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన అనేక పథకాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు అందుతున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. గులాబీ నేతలు విచక్షణతో వ్యవహరించాలని.. తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
నీతి, నిజాయతీతో పనిచేసే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్, కేటీఆర్‌లకు లేదన్నారు. దుబ్బాక తీర్పును శిరసావహించాల్సిన టీఆర్ఎస్ నేతలు.. దానిపైనా విమర్శలు చేస్తున్నారన్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ‘‘దుబ్బాకలో కోరుకున్నారు.. హైదరాబాద్‌లో కోరుకుంటున్నారు.. తెలంగాణలో కోరుకుంటారు’’ అని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు.