
రాజకీయ, ప్రజా సంఘాల నేతలకు ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు పర్మిషన్ వుండదని.. కానీ ఎంఐఎం నేతలు మాత్రం మోటార్ సైకిల్ మీద ప్రగతి భవన్‌కు వెళ్తారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ, తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో (praja sangrama yatra) భాగంగా గురువారం మహబూబ్‌నగర్‌లో (mahabubnagar) జరిగిన బహిరంగ సభకు కిషన్ రెడ్డి హాజరై ప్రసంగించారు.
పాలమూరు జిల్లాకు బీజేపీ రుణపడి వుందన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు భయపడరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలనకు చరమగీతం పాడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. అసదుద్దీన్ వచ్చినా తండ్రీకొడుకులను కాపాడలేరని ఆయన స్పష్టం చేశారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే బీజేపీపై ఎదురుదాడి చేస్తారా అని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ఢిల్లీకి వెళ్లి సీఎం ధర్నాలు చేశారని.. ప్రతిపక్షాలు ధర్నాలు చేయడానికి వీల్లేదా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్‌ది నియంతృత్వ పాలన అని .. ఆయన ధర్నా ఒక గంటలోనే ముగిసిపోయిందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ధర్నా పేరుతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్‌కు అధికారమిస్తే ఐదేళ్లు పాలించకుండానే ఎన్నికలకు వెళ్లారంటూ ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల గురించి కేసీఆర్ ఫాంహౌజ్‌లో కూర్చొని భయపడుతున్నారంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణను కేసీఆర్ కుటుంబం శాసిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కొడుకును ఏ రకంగానైనా ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో బీజేపీపై కేసీఆర్ కక్షకట్టారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, ఓవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ తల్లి బందీ అయ్యిందన్నారు. ఆనాడు చేసిన బలిదానాలు కేసీఆర్ కుటుంబం కోసం కాదని ఆయన గుర్తుచేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత అవినీతివంతమైన ప్రభుత్వం కేసీఆర్‌దేనని (kcr) ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని జేపీ నడ్డా ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (kaleshwaram project) సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రజలకు చేరకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారంలో అవినీతి జరగలేదా అని ఆయన ప్రశ్నించారు. అది తెలంగాణ రాష్ట్ర సమితి కాదని.. తెలంగాణ రజాకార్ సమితి అంటూ ఎద్దేవా చేశారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బాధ్యతాయుతమైందని.. కరోనా సమయంలో దేశ ప్రజలను మోడీ రక్షించారని నడ్డా పేర్కొన్నారు. 190 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వడం వల్లే ఈ రోజు మనమంతా ఇక్కడ మాస్క్ లేకుండా వున్నామన్నారు. కేసీఆర్ కరోనా ప్రోటోకాల్‌ను పాటించలేదని నడ్డా ఆరోపించారు. దుబ్బాక, హుజురాబాద్‌లలో బీజేపీ గెలుపుతో కేసీఆర్‌కు కష్టాలు మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆయుష్మాన్‌భవ అమలు కాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని నడ్డా మండిపడ్డారు.