కేంద్ర పథకాలు ప్రజలకు దక్కనియ్యలేదు, దారిమళ్లించారు: కేసీఆర్ పై రాజ్ నాథ్ సింగ్

By Nagaraju TFirst Published Nov 29, 2018, 3:19 PM IST
Highlights

 తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నరాజ్ నాథ్ సింగ్ కేసీఆర్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. 
 

నాగర్ కర్నూల్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నరాజ్ నాథ్ సింగ్ కేసీఆర్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. 

కేంద్రప్రభుత్వం తెలంగాణకు కోట్లాది రూపాయలు నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్ ఆ నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. 2022 నాటికి భారత దేశంలో ఏ ఒక్కరూ సొంతింటి లేని వారు ఉండకూడదన్న ఆలోచనతో ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించారని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరికీ సొంత ఇళ్లు ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.

కేంద్రప్రభుత్వం పేదప్రజలకు, ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించాలని నిధులు ఇస్తే ఆ నిధులను కేసీఆర్ దారిమళ్లించారని ఆరోపించారు. పేదలకు సొంతింటి కలను దూరం చేశారని విమర్శించారు. పేదలకు చెందాల్సిన నిధులను అడ్డుకున్నారంటూ ధ్వజమెత్తారు. 

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఏ దేశంలో లేని విధంగా జబ్బుతో, రోగంతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ఆయుష్మాన్ భవ పథకాన్ని మోదీ ప్రవేశపెట్టారని కొనియాడారు. రోగుల వైద్యానికి అయ్యేఖర్చు 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించేలా ఈ పథకాన్ని మోదీ రూపొందించారన్నారు. 

అయితే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకంలో చేరకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇకపోతే కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందలేదన్నారు. అంతేకాదు దేశంలో రైతుల దుస్థితి దయనీయంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కాలంలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. 
 
రైతుల యెుక్క దుస్థితిని, కష్టాలను గమనించిన నరేంద్రమోదీ ప్రభుత్వం వారికి కనీస మద్దతు ధర ప్రకటించిందన్నారు. అందులో భాగంగానే దేశంలో పండిస్తున్న పంటలకు మద్దతు ధర లభిస్తోందన్నారు. అలాగే 2022 వరకు రైతు ఆదాయాలను రెట్టింపు చేసేందుకు మోదీ ఆలోచిస్తున్నారని తెలిపారు.

ఇకపోతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏక  కాలంలో రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు గ్యాస్ అందించాలన్న లక్ష్యంతో ఉజ్వల పథకాన్ని రూపొందించినట్లు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 

click me!