వికారాబాద్ జిల్లాలోని నాగారం వద్ద వాగులో కారు చిక్కకున్న ఘటనలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. చెట్టు కొమ్మను పట్టుకుని ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
వికారాబాద్: జిల్లాలోని థరూర్ మండలం నాగారం వద్ద వాగులో కారు చిక్కుకుంది.కారులోని ప్రయాణీకులు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. బుధవారం నాడు వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుప్రాంతాల్లలో వాగులు,వంకల్లో వరద పోటెత్తింది., భారీ వర్షం కారణంగా నాగారం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.
అయితే వాగులో వరద ఉధృతిని అంచనా వేయలేకపోయిన కారు డ్రైవర్ వాగును దాటించేందుకు కారును ముందుకు పోనిచ్చాడు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కారు వాగు మధ్యలోకి పోగానే నిలిచిపోయింది. వాగు ఉధృతికి కారు ఒకవైపు ఒరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన కారులోని ఇద్దరు కారు దిగి పక్కనే ఉన్న చెట్టు కొమ్మను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. చెట్టు కొమ్మ సహయంతో అవతలి ఒడ్డుకు చేరుకున్నారు.
undefined
వికారాబాద్ జిల్లాలోని పెద్ద ఉమ్మెత్తాల్ లో 12 సెం.మీ, పరిగిలో 10.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కొడంగల్ లో కుండపోత వర్షం కురుస్తుంది.దీంతో పాత చెరువుకు వెళ్లే మార్గంలో కట్ట తెగిపోయింది. దీంతో పలు కాలనీలు నీట మునిగిపోయాయి. వర్షం నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణలోభారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండి వార్నింగ్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాలుకురవడంతో దసరా పర్వదిన వేడుకలకు ఇబ్బందులు నెలకొన్నాయి. బుధవారం నాడు మధ్యాహ్నం నుండే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. హైద్రాబాద్ లో బుధవారం నాడు సాయంత్రం నుండి వర్షం కురిసింది.