
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అండగా నిలిచారు. రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
ఆదివారం ఉదయం బంజారాహిల్స్ లోని సీఆర్‌పీఎఫ్ దక్షిణ విభాగ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వ్యక్తిగతంగా రూ.25 లక్షలు, తన స్నేహితులు మరో రూ.25 లక్షలు కలిపి మొత్తం రూ.50 లక్షల చెక్కును సీఆర్‌పీఎఫ్ ఐజీపీకి అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా తాను ఇక్కడికి రాలేదని సాధారణ భారత పౌరుడిగా వచ్చినట్లు తెలిపారు. సైనికుల త్యాగాల వల్లనే దేశంలోని ప్రజలంతా సురక్షితంగా ఉండగలుగుతున్నారన్నారు.
దేశం కోసం వారు చేసిన త్యాగాలు వృధాగా పోవని, వారు ఎప్పటికీ తమ గుండెల్లో నిలిచిపోతారని కేటీఆర్ అన్నారు. అనంతరం ఆయన సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. మరోవైపు అమరవీరుల కుటుంబాలకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన వంతు సాయంగా రెండున్నర లక్షల రూపాయాలను ప్రకటించారు. త్వరలోనే సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులకు రూ.2 లక్షల చెక్‌ను అందిస్తానని వెల్లడించారు.