తెలంగాణలో వార్ వన్ సైడ్, కారుకే పట్టం కట్టిన ప్రజలు

By Nagaraju TFirst Published Dec 11, 2018, 10:30 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్నో ఊహాగానాలకు చెక్ పెడుతూ ఓటర్లు తీర్పునిచ్చారు. ఓట్లన్నీ కట్టకట్టి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టటారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో విజయదుందుభి మోగించనుందని తేలిపోయింది. 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్నో ఊహాగానాలకు చెక్ పెడుతూ ఓటర్లు తీర్పునిచ్చారు. ఓట్లన్నీ కట్టకట్టి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టటారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో విజయదుందుభి మోగించనుందని తేలిపోయింది. 

తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఓటర్లు తీర్పునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. మెుదటి రౌండ్ మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ కారు బ్రేక్ లు వెయ్యకుండా దూసుకుపోయింది.  

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దాదాపుగా కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. కారు వేగానికి ప్రజాకూటమి విలవిలాడుతోంది. అన్ని జిల్లాలలోనూ టీఆర్ఎస్ భారీ ఆధిక్యతను కనబరుస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు పదుల స్థానాలను కైవసం చేసుకుంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతోంది. 

ఇకపోతే ప్రభుత్వం ఏర్పాటు దిశగానే కాకుండా భారీ ఆధిక్యం దిశగా కూడా టీఆర్ఎస్ పయనిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ నేతలు భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. ట్రబుల్ షూటర్ సిద్ధిపేట ఎమ్మెల్యే అభ్యర్థి హరీష్ రావు లక్ష మెజారిటీని దాటించే దిశగా అడుగులు వేస్తున్నారు. 

ఇకపోతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు మెుదటి నుంచి వెనుకంజలోనే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, పొన్నా లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు వెనుకంజలో ఉన్నారు. 

వీరితోపాటు వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కొండా సురేఖ, ఉత్తమ్ పద్మావతి, కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ లు సైతం వెనుకంజలో ఉన్నారు. 

మెుత్తం ఈ ఎన్నికల ఫలితాల్లో కారు జోరును ఏ పార్టీ అందుకోలేకపోతుంది సరికదా దరిదాపుల్లో కూడా కనబడటం లేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి జగిత్యాల నియోజకవర్గం అభ్యర్థి సంజయ్ కుమార్ గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు చూస్తే ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.కాంగ్రెస్ 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇకపోతే బీజేపీ నాలుగు స్థానాల్లోనూ, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించగా మరో 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యత కొనసాగిస్తున్నారు. మెుత్తంగా ఫలితాలు చూస్తే టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించనుంది అనేది వాస్తవంలా కనిపిస్తోంది.    
 

click me!