మరో టీఅర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా: హోం క్వారంటైన్ లో జీవన్ రెడ్డి

By telugu team  |  First Published Jul 29, 2020, 8:49 AM IST

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లారు.


నిజామాబాద్: కరోనా వైరస్ ప్రజాప్రతినిధులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో ఆయన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నాడు. 

ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లాకు చెందిన గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్ ఇది వరకు కరోనా వైరస్ తో బాధపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వివేకానంద గౌడ్ లకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. 

Latest Videos

undefined

కాగా, మంగళవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.... కొత్తగా తెలంగాణలో 1610 మందికి కరోనా వైరస్ సోకింది. హైదరాబాదులో 531 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57 వేలు దాటింది. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణలో 57,142 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కోవిడ్ 19తో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా వైరస్ మృతుల సంఖ్య 480కి చేరుకుంది. వరంగల్ అర్బన్ లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ జిల్లాలో గత 24 గంటల్లో 152 పాడిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదుకు దరిదాపుల్లో ఉండే రంగారెడ్డి జిల్లాలో 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 113 కేసులు నమోదయ్యాయి. 

ఆదిలాబాద్ జిల్లాలో 13, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16, జగిత్యాల జిల్లాలో 12, జనగామ జిల్లాలో 18, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20, జోగులాబం గద్వాల జిల్లాలో 34, కామారెడ్డి జిల్లాలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో నిన్నటి కన్నా ఈ రోజు తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరీంనగర్ జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి. 

ఖమ్మం జిల్లాలో 26 కేసులు నమోదు కాగా, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కేసులేమీ నమోదు కాలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో 23, మహబూబాబాద్ జిల్లాలో 14, మంచిర్యాల జిల్లాలో 13, మెదక్ జిల్లాలో 12, ములుగు జిల్లాలో 32, నాగర్ కర్నూల్ జిల్లాలో 9, నల్లగొండ జిల్లాలో 26, నారాయణ పేట జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ లో కొత్తగా కేసులు నమోదు కాలేదు. 

నిజామాబాద్ జిల్లాలో 58, పెద్దపల్లి జిల్లాలో 48, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14, సంగారెడ్డి జిల్లాలో 74, సిద్దిపేట జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 35, వికారాబాద్ జిల్లాలో 11, వనపర్తి జిల్లాలో 3, వరంగల్ రూరల్ జిల్లాలో 25, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి.

హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆస్పత్రుల్లో పడకల వివరాలను కూడా తెలంగాణ ఆరోగ్య శాఖ బులిటెన్ లో విడుదల చేసింది. ఏ విధమైన పడకలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఎన్ని పడకలపై రోగులున్నారు, ఖాళీ పడకల సంఖ్య ఎంత వంటి వివరాలను కూడా బులిటెన్ లో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 

click me!