కరీంనగర్ లో కలకలం: తుపాకీతో ఠారెత్తించిన టీఆర్ఎస్ నేత..!

By telugu news teamFirst Published Jul 17, 2021, 9:31 AM IST
Highlights

దీంతో అజ్గర్‌హుస్సేన్‌ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో వారిపై రెండు సార్లు కాల్పులు జరిపాడు. అయితే కాల్పుల నుంచి నలుగురు తప్పించుకోగా రెండు బుల్లెట్లు అజ్గర్‌ కారుకే తగిలాయి.

కరీంనగర్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ టీఆర్ఎస్ నేత తుపాకీతో అందరినీ ఠారెత్తించాడు. ఓ ఆస్తి వివాదంలో ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆస్తి కోసం తలెత్తిన వివాదంలో టీఆర్ఎస్ నేత తన సొంత సోదరుళ్లనే కాల్చేందుకు ప్రయత్నించారు. అయితే.. వారు క్షేమంగా తుపాకీ గుళ్ల నుంచి తప్పించుకున్నారు. కరీంనగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

. షాషామహల్‌ ప్రాంతంలో ఆస్తి వివాదంలో ఐదుగురు సోదరుల మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్నది. టీఆర్‌ఎస్‌ నాయకుడు అయిన సయ్యద్‌ అజ్గర్‌ హుస్సేన్‌(పెద్ద సోదరుడు) రాత్రి 9 గంటల ప్రాంతంలో అతని చిన్న సోదరుడు సయ్యద్‌ షహీల్‌ హుస్సేన్‌పై మొదట కత్తితో దాడి చేయగా మిగతా ముగ్గురు సోదరులు అడ్డుకోబోయారు.

 దీంతో అజ్గర్‌హుస్సేన్‌ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో వారిపై రెండు సార్లు కాల్పులు జరిపాడని.. అయితే కాల్పుల నుంచి నలుగురు తప్పించుకోగా రెండు బుల్లెట్లు అజ్గర్‌ కారుకే తగిలాయని వారి సోదరులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాల్పులు జరిపిన అజ్గర్‌తోపాటు అతని సోదరులను పోలీసు స్టేషన్ కి తరలించి విచారిస్తున్నారు. కాగా రివాల్వర్‌ తాము స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెప్పటం అనుమానాలకు తావిస్తున్నది. కారు అద్దాలు రెండుచోట్ల బుల్లెట్‌తో పగిలిపోయాయి. సోదరుల మధ్య గొడవ, కత్తితో దాడి జరిగిన మాట వాస్తవమే కానీ రివాల్వర్‌తో కాల్పులు జరిపినట్లుగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని కరీంనగర్‌ సిటీ అడిషనల్‌ డీసీపీ పీ అశోక్‌ తెలిపారు. కారు అద్దాలు రెండు చోట్ల పగిలి ఉన్న దానిపై సాంకేతికపరంగా ప్రాథమికంగా విచారణ జరపగా బుల్లెట్‌ మూలంగా కారు అద్దాలు పగిలినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. నలుగురు సోదరులు కలిసి అజ్గర్‌హుస్సేన్‌నే కొట్టారని ఆయన తెలిపారు. ఆ నలుగురు సోదరులు కలిసి అజ్గర్ పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇరువర్గాలపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 

click me!