దూకుడు పెంచిన వైఎస్ షర్మిల... వైఎస్సార్ తెలంగాణ పార్టీలోకి భారీగా చేరికలు

By Arun Kumar PFirst Published Dec 27, 2021, 4:16 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్, బిజెపితో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి కూడా కొందరు నాయకులు వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు, 

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ (ysrtp) పేరుతో నూతన రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు వైఎస్ షర్మిల. ఇప్పటికే ఓవైపు రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతుల పక్షాన నిలిచి పోరాడుతున్న ఆమె మరోవైపు పార్టీ బలోపేతానికి కూడా కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుండి వైఎస్సార్ టిపి లోకి వలసలను ఆహ్వానిస్తున్నారు. 

ఇవాళ(సోమవారం) పార్టీ అధినేత్రి షర్మిల సమక్షంలో అధికార టీఆర్ఎస్ (TRS)తో పాటు బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీల నాయకులు వైఎస్సార్ టిపి లో చేరారు.  రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మార్వో రవికుమార్, బీజేపీ నాయకులు రవి వైఎస్సార్ టిపి కండువా కప్పుకున్నారు. అలాగే ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ ముజాహిద్, నారాయణపేట్ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమకారుడు మదివల కృష్ణ, వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగసముద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిహెచ్ ఎల్లప్ప తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ టిపిలో చేరారు. 

హైదరాబాద్ లోని వైఎస్ షర్మిల నివాసం లోటస్ పాండ్ (lotus pond) లో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి దాదాపు 50మంది నాయకులు వైఎస్సార్ తెలంగాణ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ స్వయంగా వైఎస్ షర్మిలే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

read more  కేసీఆర్ కు పాలన చేతగాకే ధర్నాలు, చావుడప్పులు... వరి వద్దన్న ఈ సీఎం ఇక మనకొద్దు: షర్మిల ఫైర్

ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చేరిన పలువురు నాయకులు మాట్లాడుతూ... వైఎస్సార్ టిపి బలోపేతానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజల మనస్సులు తెలుసుకుని ఎన్నో గొప్ప పథకాలను అందించారని వారు గుర్తు చేశారు. వైఎస్సార్ వ్యవసాయాన్ని పండుగ చేశారని... ఉచిత కరెంటు, రుణమాఫీ, సబ్సిడీలు కల్పించి రైతులను ఆదుకున్నారని పేర్కొన్నారు. 

పేదలు కార్పొరేట్ వైద్యం పొందాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి వారి బతుకుల్లో ఆనందాన్ని నింపిన మహానేత వైఎస్సార్ అని నాయకులు గుర్తుచేశారు. తండ్రి బాటలో నడుస్తున్న షర్మిల నాయకత్వంలో పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. మున్ముందు వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. 

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలనలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్ష పార్టీలు సైతం నిలదీయడంలో విఫలమయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్లే వైఎస్సార్ తెలంగాణ పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి... పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వైఎస్సార్ టిపి కండువా కప్పుకున్న నాయకులు తెలిపారు. 

read more  కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్.. అలాంటి వాటిని ఖండించాల్సిందేనని పోస్ట్..

ఈ కార్యక్రమంలో మహ్మద్ తాహిర్, మహ్మద్ జాఫర్, షాహెద్, సయ్యద్ తబ్రస్, వై.ఈశ్వర్, సీహెచ్. నర్సింహులు, డి.ఎల్లప్ప, ఎం.మల్కప్ప, ఎ.రత్నం, ఎన్.కృష్ణ, వెంకట్, బాలు, శ్రీకాంత్, మదివల కృష్ణ, సోఫీ మదర్ హుస్సెన్, అబ్దుల్ వాహిద్, మహ్మద్ రఫిక్, మహ్మద్ అనఫ్, గణేష్ నాయక్, ఆర్ఎంపీ డాక్టర్ రవి, అజయ్, సురేష్, రవి ప్రసాద్, విష్ణు పవర్, సాలార్, మధు, వినోద్ గౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

click me!