
సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మి... మరో తెలంగాణ యువకుడు మోసపోయాడు. అక్కడ యజమానులు పెడుతున్న నరకాన్ని అనుభవించలేకపోయాడు. తనను ఎలాగైనా రక్షించండి అంటూ తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని వేడుకున్నాడు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ లో వీడియోని షేర్ చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు చెందిన 21ఏళ్ల మహ్మద్ సమీర్ ఉపాధి కోసం గత నెలలో సౌదీ అరేబియా వెళ్లాడు. ఫంక్షన్ హాల్లో పని ఇప్పిస్తానని నిజామాబాద్‌కు చెందిన ఏజెంటు ఆశ చూపించాడు. ఆ ఉద్యోగం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని ఆశపడ్డాడు. ఏజెంటుకు రూ.80వేలు చెల్లించాడు. తీరా అక్కడికి వెళ్లాక గొర్రెల కాపరిగా నియమించారు. దీంతో తనను కాపాడాలంటూ కేటీఆర్ ని వేడుకున్నాడు.
బాధితుడి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు స్పందించిన కేటీఆర్ సమీర్‌ను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.