తెలంగాణ సచివాలయానికి దక్కిన గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీసుకున్నారు. కౌన్సిల్ ప్రతినిధులు ఇవాళ మంత్రికి ఈ అవార్డును అందించారు.
హైదరాబాద్: డాక్టర్ .బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డ్ దక్కింది. భారత దేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా సచివాలయం రికార్డుల్లోకెక్కింది.
సోమవారం నాడు సెక్రటేరియట్ లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సభ్యులు రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ఈ అవార్డు ను ప్రదానం చేశారు.అత్యంత విశాలంగా,అధునాతన హంగులతో కొత్త సెక్రటేరియట్ పర్యావరణహితంగా నిర్మించబడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. సెక్రటేరియట్ ఇలా నిర్మించడం వెనుక సీఎం కేసీఆర్ ఆలోచనే కారణంగా ఆయన గుర్తు చేశారు. కేసిఆర్ చేపట్టిన హరితాహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గ్రీనరీ 7.7 శాతానికి పెరిగిందన్నారు.
కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.. రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. త్వరలోనే ప్లాటినం అవార్డు కూడా గెలుచుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా గుర్తింపు రావడం పట్ల తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేసిఆర్ ఆదేశానుసారం ఇందులో నిమగ్నమై పనిచేసిన ఈఎన్‌సీ గణపతి రెడ్డి టీమ్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు.
ప్రతిష్టాత్మక అవార్డుకు సంబంధించిన సర్టిఫికేట్ ప్రదానం చేసిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సభ్యులకు మంత్రి దన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రెటరీ శ్రీనివాస రాజు,ఈఎన్సి గణపతి రెడ్డి,ఎస్.ఈ లింగారెడ్డి , ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రతినిధులు
పాల్గొన్నారు.