Holidays Extension in Telangana: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు?

By Sumanth KanukulaFirst Published Jan 15, 2022, 9:44 AM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఇందులో సంక్రాంతి సెలవులు (Sankranti holidays) కూడా కలిసివచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడగించే (Extend Holidays)  అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఇందులో సంక్రాంతి సెలవులు (Sankranti holidays) కూడా కలిసివచ్చాయి. ఈ సెలవులు రేపటితో(ఆదివారం) ముగియనున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసుల రోజురోజుకు పెరగడంతో.. ఈ సెలవులను మరికొన్ని రోజులు పొడగించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రభుత్వానికి సూచించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలను ఈ నెల 20వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు తొలుత ఈ నెల 20వరకు అయినా సెలవులను పొడిగించాలని (Extend Holidays) భావిస్తున్నట్టుగా సమాచారం.

మరోవైపు కరోనా కేసుల్లో పెరుగుదల ఉండటం.. పలు రాష్ట్రాలు ఇదివరకే ఈ నెలఖారు వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ నెలఖారు వరకు సెలవులు పొడగించాలనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ తర్జనభర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేపటితో సెలవులు ముగియనుండటంతో.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందో అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఇక, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం విద్యా, వైద్యారోగ్య శాఖ అధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం సెలవులు పొడగించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. అయితే సెలవులు పొడగింపు జరిగితే ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. 

ఒకవేళ ప్రభుత్వం సెలవులు మరిన్ని రోజులు పొడగిస్తే.. విద్యార్థులు తరగతులు నష్టపోకుండా ఆన్‌లైన్ ద్వారా క్లాసుల నిర్వహించాల్సి ఉంటుంది. సెలవులు ఈ నెల 20వ తేదీకి మించి పొడగిస్తే ఆన్‌లైన్ క్లాసులు ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించడం తప్పనిసరి అని విద్యాశాఖ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. లేకుంటే అటు ప్రత్యక్ష తరగతులు లేవు...ఇటు ఆన్‌లైన్‌ పాఠాలు లేవన్న విమర్శ వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఫైనల్‌గా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే తాము అమలు చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 

ఇప్పటికే విద్యాశాఖ వద్ద ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు రికార్డు మెటీరియల్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ సిద్దంగా ఉన్నట్టుగా తెలిసింది. సెలవులు పొడిగించిన పక్షంలో.. స్కూల్స్‌తో పాటుగా, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని విద్యాశాఖ చూస్తుంది. మరోవైపు ఇప్పటికే కొన్ని ప్రైవేటు స్కూల్స్ జనవరి 17 నుంచి ఆన్‌లైన్ తరగతులు పునఃప్రారంభమవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందజేశాయి. 

click me!