భువనగిరి జిల్లా కలెక్టర్ పై హైకోర్టు సీరియస్... స్వయంగా కోర్టుకు హాజరవ్వాలని ఆదేశం

By Arun Kumar PFirst Published Jun 23, 2022, 11:54 AM IST
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వ భూముల ఆక్రమణపై దాఖలైన పిటిషన్ పై జరిగే తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాలని హైకోర్టు కలెక్టర్ ను ఆదేశించింది. 

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలుచేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని... దీనిపై వివరణ ఇచ్చేందుకు తదుపరి విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని భువనగిరి కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. 

వివరాల్లోకి వెళితే... భువనగిరి జిల్లా బి. పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని... వాటిని కాపాడాలంటూ బోరెడ్డి అయోధ్య రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. గ్రామంలోని సర్వేనెంబర్లు 208, 312 లోని దాదాపు 700 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయ్యిందంటూ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ పై ఇదివరకే విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ పేర్కొన్న భూముల సర్వే చేపట్టి డిజిటల్ మ్యాపింగ్ చేయాలని భువనగిరి జిల్లా  కలెక్టర్ ను ఆదేశించింది. 

అయితే తాజాగా మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తమ ఆదేశాలు అమలుచేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశించినట్లు ఎందుకు చర్యలు తీసుకోలేదో... ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ఎందుకు దాఖలు చేయలేదో చెప్పాలంటూ న్యాయస్థానం భువనగిరి అధికారులను వివరణ కోరింది. ఈ అంశంపై వివరణ ఇవ్వడానికి స్వయంగా భువనగిరి జిల్లా కలెక్టర్ తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చేనెల (జూలై) 20కి వాయిదా వేసింది.  

ఇదిలావుంటే మరో తెలుగురాష్ట్రం ఏపీలో అయితే కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఎఎస్ లకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. అయితే ఈ విషయమై ఏపీ హైకోర్టుకు ఐఎఎస్ లు క్షమాపణ చెప్పడంతో జైలు శిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేయాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టు ఇలా ఐఎఎస్ అధికారులకు శిక్ష విధించడం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. 

ఐఎఎస్ అధికారులు విజయ్ కుమార్, గోపాలకృష్ణద్వివేది, శ్యామలారావు, రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎంనాయక్ లపై హైకోర్టు సీరియస్ అయింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలను సదరు ఐఎఎస్ అధికారులు అమలు చేయలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణ కింద ఎనిమిది మంది ఐఎఎస్‌లకు  రెండు వారాల పాటు జైలు శిక్షను విధించింది.  

ఈ విషయమై ఐఎఎస్ లు కోర్టును క్షమాపణలు కోరారు. దీంతో  సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఐఎఎస్ లను కోర్టు ఆదేశించింది. జైలు శిక్షకు బదులుగా హాస్టల్ విద్యార్ధులకు సేవ చేయాలని సూచించింది. ప్రతి నెల ఏదో ఒక రోజు  సంక్షేమ హాస్టళ్లలో ఐఎఎస్ లు సేవ చేయాలని సూచించింది. అంతేకాదు ఒక రోజు పాటు కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది.

 
 

click me!