
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భైంసాలో శోభాయాత్రపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శోభాయాత్రకు అనుమతిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. పోలీసులు అనుమతించిన మార్గాల్లోనే శోభాయాత్ర నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. డీజే పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. శోభాయాత్రలో 200 మందిలోపు పాల్గొనాలని, బైంసా టౌన్ నుంచి పురాణా బజార్ వరకు శోభాయాత్రకు అనుమతి ఇచ్చినట్లు హైకోర్టు తెలిపింది.
అంతకుముందు ఉమ్మడి Adilabad జిల్లాలోని Bhainsaలో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ హిందూ వాహిని సంస్థ శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భైంసాలో Sri Rama Navami శోభాయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో హిందూ వాహిని సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. భైంసాలో గతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో భైంసాను పోలీసులు అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శ్రీరామ నవమి సందర్భంగా Shobha Yatraకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై హిందూ వాహిని సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.