కొత్త పట్టాదారులకు వచ్చే ఏడాదిలోనే నిధులు: రైతు బంధు మార్గదర్శకాలివే

By narsimha lodeFirst Published Jun 16, 2020, 6:28 PM IST
Highlights

ప్రతి ఏటా వ్యవసాయ సీజన్ కు ముందు రైతుల భూముల క్రయ విక్రయాలను పరిశీలించి.. భూములు విక్రయించిన రైతుల పేర్లను రైతు బంధు పథకం నుండి తొలగించనున్నారు.


హైదరాబాద్: ప్రతి ఏటా వ్యవసాయ సీజన్ కు ముందు రైతుల భూముల క్రయ విక్రయాలను పరిశీలించి.. భూములు విక్రయించిన రైతుల పేర్లను రైతు బంధు పథకం నుండి తొలగించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు రైతు బంధు పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.ఎకరానికి రూ. 5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పది రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో ఈ నగదును అధికారులు జమ చేయనున్నారు.

బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో ఈ ఏడాది జనవరి 23న సీసీఎల్ఏ ఇచ్చిన భూముల వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే రైతుబంధు పథకం వర్తింపజేయనున్నారు.

వీరితో పాటు ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు రైతు బంధు సహాయం అందనుంది. రైతు బంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలు పరిగణనలోకి తీసుకొంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన లబ్దిదారులు (కొత్తగా వ్యవసాయభూమిని కొనుగోలు చేసినవారు) తదుపరి ఆర్ధిక సంవత్సరంలో రైతు బంధు సహాయం ఇవ్వనున్నారు. దశలవారీగా నిధుల విడుదలలో భాగంగా తొలుత తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇస్తారు.

రైతు బంధు పథకం వద్దనుకొనే లబ్దిదారులు గివ్ ఇట్ ఫారం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ శాఖ సూచించింది.  పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు సాగు చేసుకొంటున్న 621 మంది పట్టాదారులకు కూడ రైతు బంధును వర్తింపజేయనున్నట్టుగా వ్యవసాయ తెలిపింది.

click me!