PM Modi Hyderabad Visit: మరోసారి ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా కేసీఆర్.. అసలు కారణమేమిటి?

By Sumanth KanukulaFirst Published Jul 2, 2022, 9:14 AM IST
Highlights

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ రానున్నారు. జూలై 4వ తేదీ ఉదయం వరకు ఆయన హైదరాబాద్‌లోనే  ఉండనున్నారు. అయితే హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఈసారి కూడా  స్వాగతం పలకడం లేదు. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ రానున్నారు. జూలై 4వ తేదీ ఉదయం వరకు ఆయన హైదరాబాద్‌లోనే  ఉండనున్నారు. అయితే హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఈసారి కూడా  స్వాగతం పలకడం లేదు. రాష్ట్రానికి వస్తున్న ప్రధానికి.. ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. 

ఈ క్రమంలోనే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు సొంబంధించి.. వెయిటింగ్‌ ఇన్ మినిస్టర్‌గా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు  రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీకి స్వాగతం పలకడంతో పాటు.. తిరిగి బయలుదేరే సమయంలో తలసాని వీడ్కోలు పలకనున్నారు. అయితే ఈ సారి ఏ కారణం చేత ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే విషయంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. 

ఇక, ప్రధాని మోదీ నేడు (జూలై 2) మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. జూలై 4వ తేదీన ఉదయం 9.25 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. గతంలో రెండు సార్లు కూడా  ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో కేసీఆర్ ద ఆ బాధ్యతలను తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. 

ముచ్చటగా మూడోసారి..
గతంలో కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి మోదీ హైదరాబాద్‌లో జీనోమ్ వ్యాలీకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ప్రధాని కార్యాలయమే సీఎం కేసీఆర్‌ను వద్దని చెప్పి సమాచారం ఇచ్చిందని... అందుకే వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. దీంతో అది పెద్ద చర్చనీయాంశం కాలేదు.

ఇక, ఈ ఏడాది ఫిబ్రవరిలో ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణ, ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో.. ఆయనకు స్వాగతం పలికేందుకు కేసీఆర్ దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ జ్వరంతో బాధపడటం వల్ల ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వెల్లలేదని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. 

తర్వాత ఈ ఏడాది మే నెలలో ప్రధాని మోదీ.. ఐఎస్‌బీ కాన్వొకేషన్‌లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో కూడా కేసీఆర్ దూరంగా ఉన్నారు.  ఆ సమయంలో ప్రధాని మోదీని మంత్రి తలసాని ప్రభుత్వం తరఫున స్వాగతం పలికారు. ఆ సమయంలో కేసీఆర్ నగరంలో లేకుండా బెంగళూరుకు వెళ్లారు.  ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్.. నేడు బెంగళూరు పర్యటనకు వెళ్తున్నారనే ప్రచారం సాగింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే కేసీఆర్ బెంగళూరు వెళ్లారనే టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 

అయితే మరోసారి ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంలో కేసీఆర్ దూరంగా ఉండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ సారి కేసీఆర్.. ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండటానికి గల కారణంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువటి ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయనకు స్వయంగా కేసీఆర్ స్వాగతం పలుకనున్నట్టుగా సమాచారం. తర్వాత ఆయనకు మద్దతుగా కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు దూరంగా ఉండనున్న కేసీఆర్.. యశ్వంత్ సిన్హాకు స్వయంగా స్వాగతం పలకడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. 

click me!