
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ వెంట.. ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా ఉన్నారు. కేసీఆర్ అస్వస్థతతో ఆస్పత్రికి వెళ్లారనే విషయం తెలిసిన వెంటనే ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.
కేసీఆర్ అస్వస్థతకు గురికావడంపై ఆయన వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు స్పందించారు. కేసీఆర్ రెండు రోజులు వీక్‌గా ఉన్నారని చెప్పారు. ఎడమ చేయి లాగుతుందని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. ఇక, వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక, షెడ్యూల్ ప్రకారం నేడు సీఎం కేసీఆర్ యదాద్రిలో పర్యటించాల్సి ఉంది. అయితే సడన్‌గా ఆ పర్యటన వాయిదా పడినట్టుగా అధికారులు తెలిపారు. అనివార్య కారణాలతో కేసీఆర్ పర్యటన రద్దు అయ్యినట్లు అధికారులు ప్రకటించారు. అయితే అనారోగ్యం కారణంగానే సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ పర్యటన రద్దు అయిన నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవంలో ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.