President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన కేసీఆర్.. ఇంకా ఓటు వేయని ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు..!

Published : Jul 18, 2022, 02:19 PM IST
President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో  ఓటు వేసిన కేసీఆర్.. ఇంకా ఓటు వేయని ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు..!

సారాంశం

తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. ఈ రోజు ఉదయం వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్‌కు చేరుకున్న కేసీఆర్.. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని.. తన ఓటు వేశారు. ఇక, ఇప్పటివరకు తెలంగాణలో 116 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

తెలంగాణలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటివరకు ఓటు హక్కును వినియోగించుకోలేదు. వారిలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌లు ఉన్నారు. ఓటు వేసేందుకు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉండటంతో.. వారు ఓటు వినియోగించుకుంటారని భావిస్తున్నారు. అయితే వీరిలో గంగుల కమలాకర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకుంటారా? లేదా ఓటింగ్‌కు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. 

ఇక, తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి కూడా ఓటు వేశారు. ప్రత్యేక అనుమతితో ఆయన ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటానని.. మహీధర్ రెడ్డి చేసిన అభ్యర్థను ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇదే విషయాన్ని తెలంగాణ శాసనసభ సెక్రటేరియట్‌కు ఈసీ తెలియజేసింది. 

ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో  ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 21న జరగనుంది. విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!