ఆర్టీసీతో ఆగరు.. విలువైన ఆస్తులను కేసీఆర్ అమ్మేస్తారు: భట్టి విక్రమార్క

By Siva KodatiFirst Published Nov 3, 2019, 3:33 PM IST
Highlights

ఆర్టీసీతో మొదలైన అమ్మకాలు చాలా దూరం వెళ్తాయని విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో విలువైనవన్నీ కేసీఆర్ అమ్ముతారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి రావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 
 

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. లాభాల్లో ఉన్న ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారని.. కేసీఆర్ వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని భట్టి ఎద్దేవా చేశారు.

ఇచ్చిన హామీలను అమలు చేయమనే కార్మికులు అడుగుతున్నారని.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారని.. ఆర్టీసీని సగం ప్రైవేట్‌పరం చేయడం తప్పుడు నిర్ణయమని విక్రమార్క విమర్శించారు.

ప్రభుత్వరంగ సంస్థలైతేనే బాధ్యతగా ఉంటాయని.. అదే ప్రైవేట్ వ్యవస్థలైతే లాభాపేక్షతో పనిచేస్తాయని ఎద్దేవా చేశారు. ఆర్టీసీతో మొదలైన అమ్మకాలు చాలా దూరం వెళ్తాయని విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో విలువైనవన్నీ కేసీఆర్ అమ్ముతారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి రావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 

Also Read:ఆర్టీసీ విలీనం లేదు.. 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతి: సీఎం కేసీఆర్

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. వీలినం చేయకూడదని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని.. ఇది వ్యక్తి నిర్ణయం కాదని, కేబినెట్ నిర్ణయమని సీఎం తెలిపారు. సుధీర్ఘంగా చర్చించే విలీనం సరికాదని నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ 10,400 బస్సులు నడుపుతోందని.. ఆర్టీసీ బస్సుల్లో 2,100 బస్సులు ప్రైవేట్ వ్యక్తులవేనని.. మరో 3 వేల బస్సులకు కాలం చెల్లిపోయిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమైనదని తేలిపోయిందని.. 49 వేలమంది కార్మికులు రోడ్డునపడే పరిస్ధితి వచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఇంకా ఆందోళన చేస్తామనడంలో అర్ధం లేదని.. ఎవరూ.. ఎవర్నీ బ్లాక్‌మెయిల్ చేసే పరిస్ధితి ఉండకూడదని కేసీఆర్ తెలిపారు.

Also Read:కేసీఆర్: ఏమైతది.. ఆర్టీసీ ఉండదు, కోదండరామ్, రేవంత్ రెడ్డిలకు రిప్లై

పరీక్షలు, పండగల సమయంలో సమ్మె చేస్తామంటున్నారని.. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఆర్టీసీ, ప్రైవేట్ ఆపరేటర్ల మధ్య పోటీ ఉండాలని కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో మేము కఠినంగా వ్యవహరించలేదని.. 4 ఏళ్లకాలంలో 67 శాతం జీతాలు పెంచిన రికార్డు టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.

4 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశామని.. తాము ఎవరి పొట్టా కొట్టలేదని 23 రకాల ఉద్యోగులకు జీతాలు పెంచామని.. చేనేత కార్మికుల ఆత్మహత్యల్ని తగ్గించామని ఆర్టీసీ కార్మికుల్ని తమ బిడ్డలుగానే చూస్తున్నామని కేసీఆర్ తేల్చిచెప్పారు.

యూనియన్ల మాయలో పడి కుటుంబాల్ని చెడగొట్టుకోవద్దని నవంబర్ 5లోపు బేషరతుగా ఉద్యోగాల్లో చేరొచ్చని సీఎం తేల్చిచెప్పారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకవేళ ఐదవ తేదీ అర్ధరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన 5 వేల బస్సుల్ని కూడా ప్రైవేటుకిచ్చేస్తామని సీఎం హెచ్చరించారు. 

click me!