కోడ్ ముగిసింది, ఖర్చుల వివరాలు తెలపండి: రజత్ కుమార్

By Nagaraju TFirst Published Dec 12, 2018, 3:26 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతం నిర్వహించామని సిఈవో రజత్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 
 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతం నిర్వహించామని సిఈవో రజత్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎస్, డిజిపి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ ఓటర్ జాబితా డిసెంబర్ 24 నుంచి స్టార్ట్ చేస్తామని ఎవరి పేరైనా లేకపోతే మళ్లీ నమోదు చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాను పాదర్శకంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిందని రజత్ కుమార్ తెలిపారు. 

కొన్ని చోట్ల ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవు అని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. కానీ పెద్దమెుత్తంలో ఓట్లు మిస్ అయితే శాంతిభద్రతల సమస్య వచ్చేదన్నారు. ఎక్కడా అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. 

ప్రతి సంవత్సరం ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని సిఈవో సూచించారు. ఒకవేళ అడ్రస్ మారినా, ఇతర చోటుకు వెళ్లిపోయినా ఓటర్ జాబితాలో మార్పు చేసుకోవాలని హితవు పలికారు. డిసెంబర్ 31 లోపు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. 


ఈ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయి అని ప్రచారం జరిగిందని అది పూర్తిగా అవాస్తవమన్నారు. 
ఓట్లు తొలగిస్తే ఎందుకు ఓటర్లు పెరిగారని ప్రశ్నించారు. గుత్తా జ్వాల ఓటు 2016లోనే డిలీట్ అయ్యిందని రజత్ కుమార్ తెలిపారు. 

ఈ ఎన్నికల్లో పట్టుబడ్డ నగదు సీజ్ చేసి దాన్ని స్థానిక పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఆ నగదుకు సంబంధించి డాక్యుమెంట్ ఇస్తే అన్నీ పరిశీలించి ఐటీ అధికారులకు నగదు అప్పగిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టిన ఖర్చు వివరాలను 30 రోజుల్లోగా సమర్పించాలని కోరారు. 


అలాగే ఈవీఎంల టాంపరింగ్ పై వస్తున్న ఆరోపణలను రజత్ కుమార్ ఖండించారు. ఈవీఎంలు టాంపరింగ్ సాధ్యం కాదన్నారు. టాంపరింగ్ అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కేంద్ర ఎన్నికల బలగాలు భద్రత నిర్వహించారని ఎక్కడా అలాంటి సంఘటనలు చోటు చేసుకునే ఆస్కారం లేదన్నారు. 

బెల్ కంపెనీ అధికారులు సైతం ఈవీఎంలను పరిశీలించారని తెలిపారు. ఎక్కడా ఎర్రర్ లు లేవన్నారు. వీవీప్యాట్ లను లెక్కించాలి అని కాంగ్రెస్ వాళ్లు కోరారని అయితే అది సాధ్యం కాదన్నారు. బ్యాలెట్ పేపర్ లెక్కింపుకు చాలా సమయం పడుతుందన్నారు. తాము నివేదిక ఇచ్చాం కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ వారు తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని రజత్ కుమార్ స్పస్టం చేశారు.  

click me!