మీ చేతులు,ఒళ్లు కాలే రోజులు దగ్గరపడ్డాయి: కేసీఆర్ పై గవర్నర్ కు బీజేపీ నేతల ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Oct 10, 2019, 5:53 PM IST
Highlights

ఆర్టీసీ సంస్థకు ఉన్న వేలాది కోట్లు విలువ చేసే భూములను దోచుకునేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో కోట్లాది రూపాయల ఆర్టీసీ భూములను ఎవరికి ధారాదత్తం చేశారో ప్రజలకు తెలుసునన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి చేతులు, ఒళ్లు కాలే పరిస్థితి దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు డా.కె.లక్ష్మణ్.  

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను సెల్ఫ్ డిస్మిస్ పేరుతో ఉద్యోగాల నుంచి తొలగిస్తారా అంటూ మండిపడ్డారు. ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై డా.కె.లక్ష్మణ్ నేతృత్వంలోని బీజేపీ నేతలు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేశారు. 

కేసీఆర్ నియంత పోకడలకు పోతున్నారని ఆయన తీసుకున్న నిర్ణయాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులనే కాదు, తహాశీల్ధార్ వ్యవస్థనే వద్దన్నారని, సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థలను రద్దు చేస్తామి కేసీఆర్ ఇప్పటికే కీలక ప్రకటనలు చేశారని ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సరికాదన్నారు. 

తెలంగాణ ప్రభుత్వంపై ఒక్క ఆర్టీసీ కార్మికులే కాదని అనేక మంది ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కు ఎలాంటి పరిస్థితులు దారి తీశాయో అలాంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందన్నారు. 

టీఎస్ ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు తొలగిస్తామని చెప్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరలోనే టీఆర్ఎస్ నేతలు యెుక్క ఉద్యోగాలు ఊడగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 

కార్మికుల పట్ల మానవత్వం లేకుండా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు జీతాలే చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఉద్యోగులను ఏకపక్షంగా తొలగిస్తామని కేసీఆర్ ప్రకటిస్తే చేతులు ముడుచుకుని కూర్చున్న వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పోరాటం చేశారో అన్ని వర్గాల వారితో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పోరాటం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ఆర్టీసీ బలోపేతం కోసం పనిచేయలేదని విమర్శించారు. 

ఆర్టీసీ సంస్థకు ఉన్న వేలాది కోట్లు విలువ చేసే భూములను దోచుకునేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో కోట్లాది రూపాయల ఆర్టీసీ భూములను ఎవరికి ధారాదత్తం చేశారో ప్రజలకు తెలుసునన్నారు. ఆర్టీసీ ఆస్పత్రుల్లో కనీస మౌళిక వసతులు కూడా కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంలా రగిలిపోతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కన్నెర్ర జేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై గవర్నర్ సౌందర రాజన్ కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. 

click me!