దేశ సమగ్రాభివృద్ధికి తోడ్పడే బడ్జెట్: లక్ష్మణ్

By Nagaraju penumalaFirst Published Feb 1, 2019, 8:38 PM IST
Highlights

పేద వర్గాలు, చిన్న, సన్న కారు వర్గాలకు పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉందన్నారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన పెట్టుబడి పథకం వారికి ఎంతో ఉపయోగకరం కానుందన్నారు. సాగునీరు ప్రాజెక్టుల కోసం కేంద్రం అనుమతులు ఇస్తోందని అలాగే 

తెలంగాణ ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. 
 

హైదరాబాద్: కేంద్రబడ్జెట్ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. సమర్థుడైన మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉందన్నారు. దేశం అభివృద్ధి వైపు సాగుతున్న తరుణంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రగతి వైపుకు మరింత దూసుకుపోయేలా ఉందని కొనియాడారు. 

దేశ సమగ్రాభివృద్ధికి తోడ్పడే బడ్జెట్ గా అభివర్ణించారు. మోదీ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మక, విప్లవాత్మక నిర్ణయాలన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి మోదీ అంటూ చెప్పుకొచ్చారు. విద్యుత్, కార్మిక రంగాల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. 

మోదీ పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయాలు వల్ల ఆర్థిక  సంస్కరణలు పెరిగాయని అలాగే జీడీపీ గణనీయంగా పెరిగిందని చెప్పుకొచ్చారు. 
ఆదాయపు పన్ను గతంలో ఆరు కోట్ల మంది చెల్లించే వారని కానీ ఇప్పుడు 12 కోట్లు మంది ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్నారని తెలిపారు. 

పేద వర్గాలు, చిన్న, సన్న కారు వర్గాలకు పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉందన్నారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన పెట్టుబడి పథకం వారికి ఎంతో ఉపయోగకరం కానుందన్నారు. సాగునీరు ప్రాజెక్టుల కోసం కేంద్రం అనుమతులు ఇస్తోందని అలాగే తెలంగాణ ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. 

బడ్జెట్ లో ఆదాయపు పన్ను పరిమితి పెంచారని గుర్తు చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఈ పన్ను విధానం ఉంటుందన్నారు. పీఎం శ్రమ యోగి కార్యక్రమం కొత్తగా ప్రవేశపెట్టారని బీడీ, గీత కార్మికులుకు నెలకు రూ.3000 పెన్షన్ విధానం పెట్టడం సంతోషకరమన్నారు. 

దేశ రక్షణ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. కామధేను పథకం గో సంరక్షణ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టం శుభపరిణామమని లక్ష్మణ్ ప్రశంసించారు.  

click me!