పెగాసస్ వ్యవహారం... రాజ్‌భవన్ ముట్టడికి టీ.కాంగ్రెస్ నేతల యత్నం, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jul 22, 2021, 2:31 PM IST
Highlights

పెగాసస్ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పిలుపినిచ్చిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ నుంచి రాజ్‌భవన్‌కు బయల్దేరారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. 

దేశంలో పెగాసస్ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ గురువారం ఇందిరా పార్క్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశద్రోహులపై ప్రయోగించాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ప్రతిపక్షాలపై ప్రయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చివరికి ఎన్నికల కమీషన్ అధికారులను కూడా వదలడం లేదంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రవాదులపై మాత్రం ఉపయోగించాలన్నది పెగాసస్ సంస్థ మూల సిద్ధాంతమని విక్రమార్క తెలిపారు.

బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారని .. స్వేచ్ఛ కోసం ఈ దేశంలో పోరాడాల్సి వస్తుందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసమని ఇప్పుడు ఆ స్వేచ్ఛనే హరించేసారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంప్రతిపత్తి గల సంస్థలు , ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయని విక్రమార్క ఆరోపించారు. కెనడా దేశానికి చెందిన ఓ సంస్థ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నిరూపించిందని ఆయన గుర్తుచేశారు.

టెర్రరిస్టులను అంత మొందించాల్సింది పోయి.. ప్రతిపక్షాలను బీజేపీ ప్రభుత్వం అంతమొందిస్తుందంటూ భట్టి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు లేకుండా చేసి , నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకువచ్చింది కాంగ్రెస్.. బీజేపీ ఆ స్వేచ్ఛ ను హరిస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఆందోళన చేస్తున్నామని విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. 

అనంతరం కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ నుంచి రాజ్‌భవన్‌కు బయల్దేరారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతల చలో రాజ్‌భవన్ పిలుపు నేపథ్యంలో రాజ్‌భవన్ పరిసరరాల్లో  పోలీసులు భారీగా మోహరించారు. ఇందిర పార్క్ నుండి రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో ఇందిరా పార్క్, రాజ్ భవన్ పరిసర ప్రాంతాలలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ పరిసరాలలో 1000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వర్షంలోను పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు.
 

click me!