సోనియాలా బాధపడను, కేసీఆర్ పై నిప్పులు చెరుగుతా: సుష్మా స్వరాజ్

By Nagaraju TFirst Published Nov 28, 2018, 12:05 PM IST
Highlights

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకు చిన్నమ్మగా పరిచయస్తురాలు, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ నిప్పులు చెరిగారు .తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సుష్మా స్వరాజ్ కేసీఆర్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. 
 

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకు చిన్నమ్మగా పరిచయస్తురాలు, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ నిప్పులు చెరిగారు .తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సుష్మా స్వరాజ్ కేసీఆర్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. 

కొడుకు, అల్లుడు మంత్రులుగా కూతురు ఎంపీగా తెలంగాణలో రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ సాధన కోసం 2000మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే కేసీఆర్ కేవలం 400 మందిని మాత్రమే గుర్తించారని మండిపడ్డారు. 

కేసీఆర్ కనీసం అమరవీరులను కూడా గుర్తించలేకపోయారన్నారు. అమరవీరుల రక్తంపైనే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అయితే తెలంగాణ ఉద్యమఫలితాలు ప్రజలకు దక్కలేదని కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే ఫలితం అనుభవిస్తుందన్నారు.

తెలంగాణకు బద్ద వ్యతిరేకి తెలుగుదేశం పార్టీ అని సుష్మా స్వరాజ్ ఆరోపించారు. అలాంటి టీడీపీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చెయ్యడం దారుణమన్నారు. అటు కేసీఆర్ సైతం ఎంఐఎం పార్టీతో కలుస్తారని తాను ఏనాడు ఊహించలేదని తెలిపారు.

తెలంగాణ ఐదుగురి చేతుల్లోనే బందీగా మారిందని సుష్మా స్వరాజ్ ఆరోపించారు. కేసీఆర్ పాలనను చూసి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ బాధపడ్డారేమో కానీ తానైతే మాత్రం బాధపడనని కేసీఆర్ పై నిప్పులు చెరుగుతానని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ కేసీఆర్ రాజ్యంగా భావిస్తోందన్నారు. 

తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని సుష్మా స్వరాజ్ తెలిపారు. తెలంగాణ నిర్మాణం, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. అందువల్ల తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటేసి కేసీఆర్ కుటుంబ పాలనను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికలు అబద్దానికి నిజానికి మధ్య జరుగుతున్నాయని ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. 

click me!