కాంగ్రెసుకు భారీ షాక్: టీఆర్ఎస్ లో చేరే ఆరుగురు ఎమ్మెల్యేలు వీరే...

By pratap reddyFirst Published Jan 12, 2019, 10:29 AM IST
Highlights

తొలి విడత పార్టీలో చేరతారని భావిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని, ఏ కారణం వల్ల అయినా ఆ అవకాశం దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ ఇస్తారని వార్తలు వచ్చాయి.

హైదరాబాద్‌: సంక్రాంతి పర్వదినం తర్వాత తెలంగాణ కాంగ్రెసు పార్టీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరుగురు కాంగ్రెసు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరేందుకు సిద్ధపడ్డారంటూ వస్తున్న వార్తలు కాంగ్రెసు నేతల్లో గుబులు రేపుతున్నాయి. 

మాజీ హోంమంత్రి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి సహా ఆరుగురు కాంగ్రెస్‌ శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సంక్రాంతి తర్వాత ఈ చేరికలు ఉంటాయని, ఆ తరువాత మరో నలుగురైదుగురు రెండో విడతలో టీఆర్‌ఎస్‌లో చేరతారని అంటున్నారు. 

తొలి విడత పార్టీలో చేరతారని భావిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని, ఏ కారణం వల్ల అయినా ఆ అవకాశం దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ ఇస్తారని వార్తలు వచ్చాయి.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్‌కు సీటు ఇచ్చేందుకు అభ్యంతరం లేదనే మాట వినిపిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని కార్తీక్‌రెడ్డి ఆశించారు. అయితే పొత్తులో భాగంగాఆ సీటును టీడీపీకి కేటాయించింది. దాంతో కార్తిక్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

చెవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డికే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. దీంతో సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. 

ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. తాను పార్టీ మారే విషయంపై సుధీర్‌రెడ్డి తన సన్నిహిత మిత్రులు, కార్యకర్తలతో ఇప్పటికే చేశారని అంటున్నారు. 

ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారని అంటున్నారు. 

వారితోపాటు నిజామాబాద్‌ జిల్లా నుంచి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం ఊపందకుంది. ఆయనతో టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే చర్చలు జరిపారని అంటున్నారు.  

click me!