చంద్రబాబు మంత్రమే: త్యాగాలకు రెడీ, ఏ పార్టీకి ఎన్ని సీట్లు..

By pratap reddyFirst Published Oct 24, 2018, 7:53 AM IST
Highlights

టీఆర్ఎస్ ఓటమికి త్యాగాలకు సిద్ధపడాలనే ఉద్దేశంతో సీట్ల సంఖ్య విషయంలో ప్రజా కూటమి పక్షాలు కాంగ్రెసు తమకు ఇవ్వజూపిన సీట్లకు అంగీకరించినట్లు చెబుతున్నాయి. దీంతో ప్రజా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ప్రజా కూటమి భాగస్వామ్య పక్షాలు త్యాగాలకు సిద్ధపడ్డాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మంత్రమే పని చేసినట్లు కనిపిస్తోంది. త్యాగాలకు సిద్ధపడాలనే ఆయన సూచనను భాగస్వామ్య పక్షాలన్నీ ఆచరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ ఓటమికి త్యాగాలకు సిద్ధపడాలనే ఉద్దేశంతో సీట్ల సంఖ్య విషయంలో ప్రజా కూటమి పక్షాలు కాంగ్రెసు తమకు ఇవ్వజూపిన సీట్లకు అంగీకరించినట్లు చెబుతున్నాయి. దీంతో ప్రజా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. 

కాంగ్రెసు 90 సీట్లకు, టీడీపి 15, టిజెఎస్ 10 సీట్లకు, సిపిఐ 4 సీట్లకు పోటీ చేయాలని కూటమిలో అంగీకారం కుదిరినట్లు చెబుతున్నారు. ఎక్కువ సీట్లకు పట్టుబడుతున్న టీజెఎస్ నేత కోదండరామ్ ను కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు పది సీట్లకు అంగీకరింపజేసినట్లు తెలుస్తోంది. 

అభ్యర్థుల జాబితాను, ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందనే విషయాన్ని ప్రజా కూటమి నేతలు ఒకే వేదిక మీది నుంచి ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో 60 పేర్లు ఉంటాయని చెబుతున్నారు. ప్రతి భాగస్వామ్య పార్టీకి కేటాయించే సీట్లలో సగం మంది అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశం ఉంది. కాంగ్రెసు నుంచి 40 - 50 మంది పేర్లతో, టీడీపి నుంచి 8 మంది పేర్లతో, టీజెఎస్ నుంచి 5గురి పేర్లతో, సిపిఐ నుంచి ఇద్దరి పేర్లతో తొలి జాబితా ఉండే అవకాశం ఉంది. 

click me!