తెలంగాణలో దసరా సెలవుల కుదింపు వార్తలపై స్పందించిన విద్యాశాఖ.. ఏం చెప్పిందంటే..

By Sumanth KanukulaFirst Published Sep 21, 2022, 3:21 PM IST
Highlights

తెలంగాణలో దసరా సెలవులను 14 రోజుల నుంచి 9 రోజులకు కుదించాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) పాఠశాల విద్యాశాఖకు లేఖ రాసింది. దీంతో దసరా సెలవులు కుదించే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. 

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. అయితే దసరా సెలవులను 14 రోజుల నుంచి 9 రోజులకు కుదించాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) పాఠశాల విద్యాశాఖకు లేఖ రాసింది. దీంతో తెలంగాణలో దసరా సెలవులు కుదించే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ స్పందించింది. 

తెలంగాణలో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి దసరా సెలవులు యథాతథంగా ఉంటాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ముందుగా పేర్కొన్నట్టుగానే అక్టోబర్ 9 వరకు సెలవులు కొనసాగుతాయని తెలిపింది. సెలవులు తగ్గించాలన్న ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇక, సెప్టెంబర్ 25 ఆదివారం కావడంతో విద్యార్థులు ఆ రోజు నుంచే సెలవులు మొదలు కానున్నాయి. 


ఎస్‌సీఈఆర్‌టీ ఏం చెప్పిందంటే..
దసరా సెలవులను 14 రోజుల నుంచి 9 రోజులకు కుదించాలని ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదించింది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు జూలై 11 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారని, సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినం సందర్బంగా సెలవు ఇచ్చారని ఎస్‌సీఈఆర్టీ  డైరెక్టర్ ఎం రాధారెడ్డి పాఠశాల విద్యాశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో ఏడు పని దినాలు తగినట్టుగా తెలిపారు.

‘‘విద్యా క్యాలెండర్ ప్రకారం.. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు 14 రోజులు దసరా సెలవు దినాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే తగ్గిన పనిదినాలను.. అక్టోబర్ 1 నుంచి 9 వరకు దసరా సెలవులు ఇవ్వడం ద్వారా సవరించవచ్చు. లేకుంటే నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు ప్రతి నెల రెండో శనివారాన్ని పనిదినాలుగా మార్చవచ్చు’’ అని రాధారెడ్డి ప్రతిపాదించారు. అయితే దసరా సెలవులను తగ్గించాలనే ప్రతిపాదనపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 

click me!