జగ్గారెడ్డి టార్గెట్ రేవంత్ రెడ్డి: కేసీఆర్ కరోనా వ్యాఖ్యలపై లైట్

By telugu teamFirst Published Mar 21, 2020, 7:24 AM IST
Highlights

తమ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెసు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఫేస్ బుక్ లో పెడితే పోరాటం చేస్తారా అని అడిగారు. కేసీఆర్ ను జగ్గారెడ్డి వెనకేసుకొచ్చారు.

హైదరాబాద్: పీసీసీ వర్గింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని సంగారెడ్డి కాంగ్రెసు ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్ చేశారు. తాను జైలులో ఉంటే పరామర్శించేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి విలువలు ఉన్న వ్యక్తి అని, తిమింగలాల వంటి నేతలున్న పార్టీని నాలుగేళ్లుగా సమన్వయం చేస్తూ నడిపిస్తున్నారని ఆయన ఆయన అన్నారు. ఖైదీలు అన్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పు పట్టడం సరి కాదని ఆయన శుక్రవారం శాసనసభ ఆవరణలో మీడియాతో అన్నారు. 

ఖైదీలు ఏం చెప్తే అది చేస్తావా, వారు జైలులోనే ఉండిపోవాలంటే ఉంటావా అని ప్రశ్నించారు. భూ అవినీతిపై పోరాడే బాధ్యతను అధిష్టానం రేవంత్ రెడ్డికి అప్పగించిందనే విషయంపై కూడా ఆయన స్పందించారు. దానిపై పార్టీ కోర్ కమిటీలో కుంతియాను అడుగుతామని, పార్టీని కుంతియా, రేవంత్ రెడ్డిలు చూసుకుంటారా అని అన్నారు.

వారిద్దరే జెండాలు పట్టుకుని తిరుగుతారా, తమ అవసరం లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై కార్యాచరణను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తే పార్టీ పోరాడుతుంది తప్ప వ్యక్తిగతంగా ఫేస్ బుక్ లో పెడితే ఎవరూ సహకరించరని ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాయితీని ఎవరు శంకించినా సహించేది లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు దేశానికి పట్టిన కరోనా అని కేసీఆర్ ఉద్వేగంలో అని ఉంటారని ఆయన అన్నారు. కేసీఆర్ కూడా కాంగ్రెసు నుంచి వచ్చినవారేనని, తమకన్నా ఆయనకే ఎక్కువ తెలుసునని జగ్గారెడ్డి అన్నారు.

click me!