మునుగోడు ఉప ఎన్నికపై ఎలాంటి సర్వే చేయలేదు.. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్

By Sumanth KanukulaFirst Published Nov 2, 2022, 4:21 PM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్‌ఎస్‌ఎస్‌) పేరుతో ఓ పోస్టు వైరల్‌గా మారింది.   ‘ఆర్‌ఎస్‌ఎస్‌ అంతర్గత సర్వే నివేదిక’ పేరుతో వైరల్ అవుతున్న పోస్టులో మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని.. బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందని ఉంది. 

మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియడం లేదు. కొన్ని నకిలీ పోస్టులను కూడా జనం నిజమని నమ్మేస్తున్నారు. దీంతో తమపై వస్తున్న నకిలీ పోస్టులపై పార్టీలు, సంస్థలు, వ్యక్తులు.. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్‌ఎస్‌ఎస్‌) పేరుతో కూడా ఓ పోస్టు వైరల్‌గా మారింది.   ‘ఆర్‌ఎస్‌ఎస్‌ అంతర్గత సర్వే నివేదిక’ పేరుతో వైరల్ అవుతున్న పోస్టులో మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని.. బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందని ఉంది. 

అయితే ఈ వ్యవహారం  ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పోస్టు దర్మార్గపు చర్య అని పేర్కొన్న  ఆర్‌ఎస్‌ఎస్‌.. తీవ్రంగా ఖండించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎలాంటి సర్వే నిర్వహించలేదని తెలిపింది. ఈ మేరకు ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కార్యవాహ కాచం రమేష్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. నకిలీ వార్తలకు కారణమైన వ్యక్తులను ప్రభుత్వం గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

‘‘నవంబర్ 3న మునుగోడు ఎన్నికల నేపథ్యంలో అస్పష్టంగా విడుదల చేసిన ఈ నివేదికలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సంతకం చేశారు. ప్రజలను గందరగోళపరిచే, తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో స్పష్టంగా దీనిని విడుదల చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అటువంటి సర్వే నిర్వహించలేదని.. ఈ నకిలీ పత్రాన్ని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం’’ అని చెప్పారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ గత 97 సంవత్సరాలుగా దేశ నిర్మాణ ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థగా పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థాగతంగా రాజకీయాలతో గానీ, రాజకీయ సర్వేలలో గానీ పాల్గొనదని వెల్లడించారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం నకిలీ, నిరాధారమైన, అసంబద్ధమైన వార్తలు,  వ్యాఖ్యలను ఆశ్రయిస్తున్న వ్యక్తులు ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థను కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని మండపడ్డారు. ఇది ప్రజాస్వామ్య, సామాజిక విలువలను అవహేళన చేయడం, దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదని అన్నారు. 
 

click me!