తల తెగిపడినా వదలను, మోదీ కూడా కాపాడలేడు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

By Nagaraju penumalaFirst Published Feb 19, 2019, 8:59 PM IST
Highlights

తల తెగి పడినా సరే కేసీఆర్ అక్రమాలపై మాట్లాడుతూనే ఉంటానన్నారు. కేసీఆర్ కర్మ కాలిన రోజు ఆయన కూడా ఊచలు లెక్కపెడుతారన్నారు. అప్పుడు మోదీ కూడా ఆపలేడన్నారు. A5 వరకు జైల్‌కు పంపించారని గుర్తు చేశారు. మోదీపై మోజు పడి కేంద్ర దర్యాప్తు సంస్థలతో గంటల కొద్ది విచారిస్తున్నారని ధ్వజమెత్తారు. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మంగళవారం ఓటుకు నోటు కేసులో ఈడీ అధికారుల విచారణకు హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులో భాగమే ఈడీ విచారణ అంటూ చెప్పుకొచ్చారు. 

ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానన్నారు. బుధవారం మరోసారి విచారణకు హాజరుకావాలని కోరారని మళ్లీ విచారణకు హాజరై అన్ని సమాధానాలు చెప్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కైందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

శాసనసభ ఎన్నికల సమయంలో ఐటీ అధికారులను ప్రయోగించారని త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈడీని ప్రయోగిస్తున్నారని అన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏసీబీ‌ని ఉపయోగించి కేసీఆర్ గెలిచాడని చెప్పుకొచ్చారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష్య సాధింపేనన్నారు. 

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లది పెవికాల్ బంధం అంటూ ఆరోపించారు. ఇటీవల  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాననే తనపై కేసులు పెట్టారని తెలిపారు. 

తల తెగి పడినా సరే కేసీఆర్ అక్రమాలపై మాట్లాడుతూనే ఉంటానన్నారు. కేసీఆర్ కర్మ కాలిన రోజు ఆయన కూడా ఊచలు లెక్కపెడుతారన్నారు. అప్పుడు మోదీ కూడా ఆపలేడన్నారు. A5 వరకు జైల్‌కు పంపించారని గుర్తు చేశారు. మోదీపై మోజు పడి కేంద్ర దర్యాప్తు సంస్థలతో గంటల కొద్ది విచారిస్తున్నారని ధ్వజమెత్తారు. 

చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరుపుతున్నారని విచారణ అనంతరం మూడో కృష్ణుడు ఈడీ ఏం తేల్చుతుందోనంటూ సెటైర్ వేశారు. ఇకపోతే ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి కుమారులను ఎందుకు పిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

వారికి రాజకీయాలతో సంబంధాలు లేవని చెప్పుకొచ్చారు. మా కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్న కొద్దిమంది పెద్దలు చేస్తున్న ఈ కుట్రలను తెలంగాణ ప్రజలు గ్రహించాలని విన్నవించుకున్నారు. 

తన మీద పోటీ చేసిన నరేందర్ రెడ్డి వద్ద రూ. 51 లక్షలు దొరికితే దానిపై ఈడీ, సీబీఐ ఎందుకు విచారించడం లేదో తెలియడం లేదన్నారు. మోదీ, కేసీఆర్‌లపై వ్యతిరేకంగా పోరాడుతున్నవారినే దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.  

click me!