కరోనా కిట్ల కొనుగోళ్లలో భారీ కుంభకోణం, ఈటలను అందుకే తప్పించారా?: రేవంత్ సంచలనం

By narsimha lodeFirst Published May 13, 2021, 4:36 PM IST
Highlights

కరోనా కిట్లు, మందుల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

హైదరాబాద్: కరోనా కిట్లు, మందుల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారంనాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.   ఏపీఎస్ఎంఐడీసీ ద్వారా కరోనా కిట్స్ కొనుగోళ్లలో వందల కోట్లు పక్కదారి పట్టాయన్నారు. గత ఏడాది కరోనా సమయంలో పలువురు సీఎం రిలీఫ్ పండ్ కు నిధులిచ్చారని ఆ నిధులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.  

ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టాయన్నారు. కరోనా కిట్స్ కొనుగోళ్లలో  విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ విషయమై అవకతవకలు  జరిగాయని నివేదిక ఇచ్చిందన్నారు. ఈ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారని  ఆయన ప్రశ్నించారు. టీఎస్‌ఎంఐడీసీ కొనుగోళ్లలో మంత్రి ఈటల రాజేందర్ కు సంబంధం  ఉంటే ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.  ఈ కుంభకోణం ఈఎస్ఐ కంటే పెద్ద స్కామ్ అని  ఆయన  చెప్పారు. వ్యాక్సిన్ కొనుగోలుతో పాటు ఇతరత్రా కొనుగోలు కోసమే కేటీఆర్ ఛైర్మెన్ గా టాస్క్‌ఫోర్స్ కమిటీని  ఏర్పాటు చేయడం వెనుక ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ మంత్రిగా కొనసాగితే వ్యాక్సిన్ కొనుగోళ్లు, మందుల కొనుగోలులో  తమకు సహకరించే అవకాశం ఉందో లేదో అనే అనుమానంతో భూ కబ్జాల ఆరోపణలతో ఆయనను భర్తరఫ్ చేసి ఉంటారని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

 కరోనా కు సంబంధించిన  కిట్స్  కొనుగోళ్లలో  కుంభకోణంపై విచారణ జరిపించాలని  ప్రధానికి  లేఖ రాసినట్టుగా ఆయన చెప్పారు.  కరోనాపై అవగాహన లేనివాళ్లు టాస్క్‌ఫోర్స్ కమిటీలో ఉన్నారన్నారు.  సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా, డీఆర్‌డీఓ ఛైర్మెన్ సతీష్ రెడ్డి, వైద్య నిపుణులు నాగేశ్వర్ రెడ్డి లాంటి వాళ్లను  టాస్క్‌ఫోర్స్ లో నియమిస్తే ఉపయోగం ఉండేదని ఆయన చెప్పారు. సైంటిస్టులు, నిపుణులతో కమిటీ వేస్తే ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైద్యానికి ఉపయోగించే పరికరాలపై జీఎస్టీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

వ్యాక్సిన్ తయారీలో ఫార్మా సంస్థలకు కేంద్రం ఆర్ధిక సహాయం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయన్నారు. ఈ రెండు సంస్థలే ఉత్పత్తి చేస్తే  2023 వరకు వ్యాక్సినేషన్ పూర్తి కాదని ఆయన చెప్పారు.  ఈ విషయమై దేశంలోని ప్రధాన పార్టీలు ప్రధానికి లేఖ రాసినా పట్టించుకోవడం లేదన్నారు. కానీ ఈ రెండు సంస్థలు పేటేంట్ పేరుతో వ్యాక్సిన్ సమాచారం ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005  ఆధారంగా  ఈ ఫార్మా సంస్థల నుండి  కరోనా వ్యాక్సిన్ తయారు చేసే సమాచారాన్ని తీసుకొని వ్యాక్సిన్ తయారు చేసే సామర్ధ్యం ఉన్న కంపెనీలు ఇచ్చి  వ్యాక్సిన్ తయారు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

click me!