టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తమ పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తామని అన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తమ పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తామని అన్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ కార్యకర్తలు నిర్భయంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని చెప్పారు. అధికార పార్టీ చర్యలను నిర్భయంగా తెరపైకి తీసుకురావాలని కార్యకర్తలను కోరుతున్నట్టుగా తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రత్యర్థి శక్తులన్నీ ఒక్కటయ్యాయని రేవంత్ అన్నారు. సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలు దళారుల మాదిరి కాంగ్రెస్‌ను ఓడించేందుకు చేతులు కలిపారని ఆరోపించారు.
ఇదిలాఉంటే, అసదుద్దీన్ ఒవైసీకి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని ఆరోపించారు. దీనిపై దర్గా దగ్గరికి రమ్మన్నా, భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గరకి రమ్మన్నా వస్తానని .. మరి మసీదులో ప్రమాణం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఒంటిపై షెర్వాణీ ఫైజామా ఉందని అనుకున్నానని.. కానీ షెర్వాణీ కింద ఖాకీ నిక్కర్ కూడా ఉందని విమర్శించారు.
ముస్లిం హక్కుల కోసం పోరాడేందుకు అసదుద్దీన్‌ను ఆయన తండ్రి బారిష్టర్ చదివిస్తే .. ఆయన మాత్రం ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మద్ధతుగా వున్నారని దుయ్యబట్టారు. గోషామహాల్‌లో రాజాసింగ్‌పై ఎంఐఎం ఎందుకు అభ్యర్ధిని నిలబెట్టలేదని అసదుద్దీన్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ లాంటి వారిని కాపాడేందుకు అసదుద్దీన్ ఒవైసీ అబద్ధాలు చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు.