తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ తన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తొలి జాబితాలో పొన్నాల పేరు లేదు.
జనగామ టికెట్ తనదేనని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ తన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తొలి జాబితాలో పొన్నాల పేరు లేదు. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు తొలి జాబితాలో చోటు దక్కకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మహాకూటమిలో భాగంగా జనగామ టికెట్ టీజేఎస్ దక్కిందనే వార్తలు వెలువడ్డాయి. దీంతో కంగారుపడిపోయిన పొన్నాల.. పార్టీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. పార్టీకి తాను చేసిన సేవలను వారికి గుర్తుచేస్తూ జనగామ టిక్కెట్‌ను తనకే కేటాయించాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనగామ టిక్కెట్‌ను టీజేఎస్ కి కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. టీజేఎస్ కూడా ఆ టిక్కెట్ కోరుతున్నట్లు ఎక్కడా సమాచారం లేదని.. కోదండరామ్ ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదన్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ వదులుకోవాల్సి వస్తోందన్నారు.
రెండో జాబితాలో తనకు టిక్కెట్ కచ్చితంగా వస్తుందని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు న్యాయం చేయకపోతే ప్రత్యర్థికి మననే ఆయుధం అందించినట్లు అవుతుందని పొన్నాల అభిప్రాయపడ్డారు.