
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బీజేజీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ రోజు, రేపు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు హైదరాబాద్ నగరానికి విచ్చేస్తున్నారు. ఆయన శనివారం హైదరాబాద్‌కు విచ్చేసి బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొని ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. ఈ నెల 4వ తేదీ అంటే సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి వెళ్లిపోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన షెడ్యూల్ వివరాలు ఓ సారి చూద్దాం. అయితే, భద్రతా కారణాల రీత్యా ఆయన షెడ్యూల్‌లో మార్పులు ఉండొచ్చనీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఆయన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ రోజు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో బయల్దేరి వస్తారు. మధ్యాహ్నం 2.55 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న మాదాపూర్‌లోని హెచ్ఐసీసీకి వెళతారు. అనంతరం ఆయన తన హైదరాబాద్ పర్యటనలో బస చేయనున్న నోవాటెల్ హోటల్‌కు మధ్యాహ్నం 3.20 గంటలకు చేరుకుంటారు. తన బసలో కాసేపు విశ్రాంతి తీసుకుని కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి బయల్దేరుతారు. ఈ సమావేశాల్లోనే రాత్రి 9 గంటల వరకు ఉంటారు. తిరిగి నోవాటెల్‌కు వెళ్లిపోతారు.
మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం నేరుగా మళ్లీ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. ఉదయం 10 గంటలకు ఆయన హెచ్ఐఐసీకి చేరుకుంటారు. ఆదివారం ఆ సమావేశాల్లోనే సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటారు. అనంతరం ఆయన పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో పాల్గొనడానికి ముందు హోటల్‌లో కాసేపు బస చేస్తారు. నోవాటెల్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 5.55 గంటలకు ఆయన హెచ్ఐసీసీ నుంచి పరేడ్ గ్రౌండ్‌కు బయల్దేరుతారు. 35 నిమిషాల్లో ఆయన పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సుమారు గంట సేపు ఆయన సభలోనే ఉంటారు. 7.30 గంటల వరకు ఆయన సభలో ఉండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆయన ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు.
కాగా, సోమవారం ఉదయం ప్రధాని మోడీ హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళతారు. 4వ తేదీ ఉదయం 9.20 గంటల కల్లా ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లనున్నారు.
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రధాని బస చేయనున్న నోవాటెల్ హోటల్, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న హెచ్ఐసీసీ పరిసరాల్లో వేల సంఖ్యలో పోలీసులతో భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.