
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. సిక్ విలేజ్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.. దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్, బ్యాటరీ వెహికల్స్.. పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పాల్గొన్నారు. పరికరాల పంపిణీ అనంతరం అమిత్ షా.. దివ్యాంగులతో మాట్లాడారు.
ఇక, అంతకుముందు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన వేడుల్లో పాల్గొన్న అమిత్ షా.. అనంతరం బేగంపేట టూరిజమ్ ప్లాజాకు చేరుకున్నారు. అక్కడ బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, మునుగోడు ఉప ఎన్నికపై అమిత్ షా వారితో చర్చించారు. ఈ సమేశంలో ఇటీవల బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా అనుసరించాల్సిన వ్యుహాంపై పార్టీ నేతలకు అమిత్ షా మార్గనిర్దేశనం చేసినట్టుగా తెలుస్తోంది.