
సూర్యాపేట : గంజాయికి బానిసై నిత్యం వేధిస్తున్న కుమారుడిని కన్న తల్లిదండ్రులే కడతేర్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలగిరి ఆదర్శ్ నగర్ కు చెందిన ఆమనగంటి యాదగిరి, వెంకటమ్మల కుమారుడు కిరణ్ (23) డీజే సౌండ్ బాక్సులు అద్దెకి ఇస్తూ ఉంటాడు. అతనికి వివాహం అయ్యింది. భార్య సౌమ్య, ఒక కుమారుడు ఉన్నారు.
గంజాయికి బానిసైన కిరణ్ రోజు ఇంట్లో గొడవ పడుతుండడంతో విసిగిపోయిన భార్య సౌమ్య కుమారుడితో సహా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దీంతో మరింతగా గంజాయి తాగడానికి అలవాటు పడ్డాడు కిరణ్. రోజూ గంజాయి తాగి రావడం.. తల్లిదండ్రులను విపరీతంగా కొట్టడం చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే తనకు డబ్బులు ఇవ్వాలని రెండు నెలల క్రితం ఇంట్లోని వస్తువులు, దుస్తులను తగలబెట్టాడు. కుమారుడి వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఉన్న ఊరు విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయారు.
నెమలి ఈకలు ఇస్తానని ఆశపెట్టి, బాలికపై లైంగిక దాడి..మరణించే వరకు జైలు శిక్ష..
కాగా, 15 రోజుల క్రితం దగ్గరి బంధువు చనిపోతే పరామర్శించడానికి మళ్ళీ తిరుమలగిరికి వచ్చారు. దీంతో కిరణ్ తల్లిదండ్రులను కొట్టి.. హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఆ రోజు నుంచి వారిని ఇంట్లోనే ఉంచుకున్నాడు. రోజూ గంజాయి మత్తులో కొడుతుండేవాడు. అలా ఈ సోమవారం కూడా గంజాయి తాగి, ఇంటికి వచ్చి మత్తులో మళ్లీ తల్లిదండ్రులను కొట్టాడు. అలా కొడుతూ కొడుతూనే కిందపడిపోయాడు. అప్పటికే కొడుకు తీరుతో విసిగిపోయి ఉన్న తల్లిదండ్రులు ఇదే అదునుగా కిరణ్ మెడకు తాడును కట్టి బిగించి చంపేశారు.
ఆత్మరక్షణ కోసమే…
అయితే, కొడుకు మృతి తట్టుకోలేక వారు ఏడుస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత కిరణ్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. రెండేళ్లుగా రోజు గంజాయి సేవించి వచ్చి వేధిస్తున్నాడని.. రోజు కొడుతుండడంతో భయం భయంగా బతుకుతున్నామని.. కుమారుడు ఏం చేస్తున్నాడని ఎవరైనా అడిగితే ఏమీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నామని.. భార్య కూడా వదిలేసి వెళ్లిపోయిందని.. ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు సోమవారం మధ్యాహ్నం వచ్చి మమ్మల్ని మళ్ళీ కొట్టాడు. విధిలేని పరిస్థితుల్లో ఆత్మరక్షణకోసం చంపేశాం అని ఒప్పుకున్నారు.