కేసీఆర్ కు ఆర్టీసి సమ్మె హీట్: సమ్మె బాటలో లారీ, టాక్సీ డ్రైవర్లు

By telugu teamFirst Published Oct 11, 2019, 12:33 PM IST
Highlights

తెలంగాణలో సమ్మె ఆర్టీసికి మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇతర సంస్థలకు కూడా ఇది పాకేట్లుంది. తాజాగా, టాక్సీ, లారీ డ్రైవర్లు జెఎసిలు కూడా సమ్మెకు దిగే ఆలోచన చేస్తున్నాయి.

హైదరాబాద్: ఆర్టీసి సమ్మె సెగ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు గట్టిగానే తాకేట్లు కనిపిస్తోంది. టీఎన్డీవోలను సంతృప్తి పరచడానికి ఆయన బుధవారం ప్రయత్నం చేశారు. కానీ, ఇతర రంగాలకు ఆర్టీసి సమ్మె వ్యాపించే సూచనలు కనిపిస్తున్నాయి. 

లారీ, టాక్సీ డ్రైవర్ సంయుక్త కార్యాచరణ సమితులు (జెఎసిలు) సమ్మె బాట పట్టడానికి సిద్ధపడుతున్నారు. యూనియన్లను ఖతం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ వారు సమ్మెకు దిగడానికి సిద్ధపడుతున్నారు. 

ఆర్టీసి సమ్మెను బలపరుస్తూ జెఎసిల నాయకులు గవర్నర్ కు వినతిపత్రం సమర్పించాలని ఆలోచిస్తున్నారు. ఆర్టీసి సిబ్బంది డిమాండ్లను ప్రభుత్వం తీర్చేలా చూడాలని వారు గవర్నర్ ను కోరనున్నారు. 

ఆర్టీసి సమ్మెకు మద్దతుగా ట్రైడ్ యూనియన్లు అక్టోబర్ 14వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద జరిగే సంఘీభావ సమావేశంలో పాల్గొననున్నాయి. ముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆర్టీసి బస్సు డిపోల ముందు ట్రేడ్ యూనియన్ల నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. 

రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్లను ఖతం చేయాలనే కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సిఐటీయు ప్రధాన కార్యదర్శి సాయిబాబ అంటున్నారు. ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న 20 ట్రేడ్ యూనియన్ల ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతారని ఆయన అంటున్నారు. 

click me!