గ్రూప్ 2 అభ్యర్ధిని ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది . ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్రూప్ 2 అభ్యర్ధిని ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శనివారం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అతనిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
రాజకీయ వర్గాల్లో , విద్యార్ధుల్లోనూ తీవ్ర దుమారానికి కారణమైన ప్రవల్లిక ఆత్మహత్యకు శివరామే కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కూడా ఇదే నిర్ధారించారు. ఈ క్రమంలో శివరాం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవల్లిక గదిలో సోదాలు నిర్వహించిన అధికారులకు సూసైడ్ నోట్ లభించింది. అలాగే ఆమె మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు. శివరామ్‌కు మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో ప్రవల్లిక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు.
Also Read: ప్రవల్లిక ఆత్మహత్య కేసు : శివరాం రాథోడ్‌ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు
అలాగే ఈ విషయాలను ప్రవల్లిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ ద్వారా పంపింది. ఈ వివరాలను పోలీసులకు వాంగ్మూలం రూపంలో అందించాడు ప్రణయ్. దీంతో శివరాంపై ఐపీసీ 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో తెలంగాణ పోలీసులకు శివరాం చిక్కినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అతను శుక్రవారం నాంపల్లి కోర్టులో తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేసి లొంగిపోయాడు.
మరోవైపు.. ప్రవల్లిక కుటుంబ సభ్యులు బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు. కరీంనగర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రవల్లిక కుటుంబ సభ్యులు ఇవాళ తనను కలిశారని తెలిపారు. ఒకడు మా అమ్మాయిని వేధించి చంపాడని తన దృష్టికి తీసుకొచ్చారని.. న్యాయం చేస్తానని వాళ్లకు హామీ ఇచ్చానని మంత్రి వెల్లడించారు.
ప్రవల్లిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని .. ఆ కుటుంబానికి అండగా వుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే బాధితురాలి విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని.. నిరుద్యోగులకు న్యాయం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. రాహుల్, ప్రియాంక గాంధీలు వచ్చి మాయమాటలు చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారీకి న్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.