మునుగోడు బై పోల్: పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారులో రూ.20 లక్షలు నగదు స్వాధీనం..

By Sumanth KanukulaFirst Published Oct 22, 2022, 12:43 PM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నిక వేళ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ కారులో రూ. 20 లక్షల పట్టుబడ్డాయి.

మునుగోడు ఉప ఎన్నిక వేళ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మునుగోడు నియోజకర్గంలోని ప్రధాన రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటి చేసి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ కారులో రూ. 20 లక్షల పట్టుబడ్డాయి. వివరాలు.. తనిఖీల్లో భాగంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ కారును చెక్ చేశారు. అందులో దాదాపు రూ. 20 లక్షలను గుర్తించారు. అయితే ఆ నగదుకు సంబందించి అతని వద్ద ఎలాంటి రశీదులు, ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో డబ్బును తరలిస్తున్న అభిషేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కారులో తరలిస్తున్న కోటి రూపాయల నగదును పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. చల్మెడ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీల్లో కరీంనగర్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ భర్త ప్రయాణిస్తున్న కారులో నగదును పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన డైనమిక్ టీమ్స్ తనిఖీల్లో భాగంగా కారులో నగదును గుర్తించారు. 

నల్గొండ పోలీసు సూపరింటెండెంట్ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చెల్మెడ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు బృందం టాటా సఫారీని ఆపారు. కారును కరీంనగర్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ వేణు నడుపుతున్నారు. పోలీసు బృందం అతని వాహనాన్ని తనిఖీ చేసి, కారు బూట్ తెరవమని కోరింది. అక్కడ కోటి నగదు నింపిన బ్యాగును పోలీసులు గుర్తించారు. డబ్బు గురించి పోలీసులు.. ప్రశ్నించినప్పుడు వేణు డబ్బు ఎక్కడికి తీసుకెళుతున్నారు అనే దాని గురించి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు. ఖాతాలో లేని నగదు యొక్క మూలాన్ని వివరించడానికి అతను ఎటువంటి పత్రాలను అందించలేకపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

click me!