తెలంగాణ చరిత్రలో తొలిసారిగా: స్థానిక బరిలో ఎంటెక్ విద్యార్ధిని

By Siva KodatiFirst Published Apr 25, 2019, 4:13 PM IST
Highlights

 రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎంటెక్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఎన్నికల బరిలో నిలిచింది. జగిత్యాల జిల్లా బుగ్గారం జడ్పీటీసీ స్థానానికి టీజేఎస్ తరపున చుక్క వినీల అనే విద్యార్ధిని నామినేషన్ వేసింది

రాను రాను యువతలో రాజకీయాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుత దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చతో పాటు ఎన్నికల్లో సైతం కొందరు యువతీ, యువకులు పాల్గొంటున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎంటెక్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఎన్నికల బరిలో నిలిచింది. జగిత్యాల జిల్లా బుగ్గారం జడ్పీటీసీ స్థానానికి టీజేఎస్ తరపున చుక్క వినీల అనే విద్యార్ధిని నామినేషన్ వేసింది.

ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. వినీల తండ్రి చుక్కా గంగారెడ్డి తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని నవీపేట-1 ఎంపీటీసీ స్థానానికి కొండపల్లి అంకిత అనే ట్రాన్స్‌జెండర్ నామినేషన్ వేశారు. సంగారెడ్డి మండలం పన్యాల ఎంపీటీసీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ స్ధానికేతరుడికి అవకాశం ఇవ్వడంతో 50 మంది నామినేషన్లు వేశారు.

కాగా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల మొదటి విడతకు నామినేషన్ల దాఖలుకు బుధవారంతో గడువు ముగిసింది. మొత్తం 2,166 ఎంపీటీసీ స్థానాలకు గాను.. సుమారు 13,200 మంది, 197 జడ్పీటీసీ స్థానాలకు గాను 2,040 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

రెండో విడత ఎన్నికలకు ఈ నెల 26న నోటిఫికేషన్ జారీ కానుంది. మరో వైపు పోలింగ్ కోసం అన్ని రిజిస్టర్డ్ పార్టీలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు వేర్వేరు కామన్ గుర్తులను కేటాయించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

అయితే ఎన్నికల కోడ్ అమలులో ఏపీలో చూపిన శ్రద్ధను తెలంగాణలో ఎన్నికల సంఘం ఎందుకు చూపడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. పక్షపాత ధోరణితో వ్యవహరించడం మంచిది కాదన్నారు.     

click me!